
- ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం టౌన్, వెలుగు : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు సూచించారు. ఈ విషయమై శుక్రవారం ఆయా శాఖల సంబంధిత అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి, సమస్యను పరిష్కరించడం లాంటి లక్ష్యంతో కలిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాలని సూచించారు. పిల్లలను పనిలో పెట్టుకునే ఓనర్లపై కేసులు నమోదు చేయాలన్నారు. బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రతిఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తిస్తున్నట్లు తెలిపారు.