ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో 150 కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంను మంగళవారం వరంగల్ సీపీ తరుణ్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కెమెరాలతోనే క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. జనగామకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా సాంక్షన్ అయిందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. టౌన్​లో మరో 150 కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ చౌరస్తాలో గతంలో తొలగించిన ట్రాఫిక్​ సిగ్నల్స్ ను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీ 
పి.సీతారాం, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, రఘుచందర్, సీఐలు శ్రీనివాస్ యాదవ్, రాఘవేందర్, సంతోష్ తదితరులున్నారు. అనంతరం టౌన్ పీఎస్ లో సీపీ క్రైం రివ్యూ నిర్వహించారు. రౌడీషీటర్ల కదలికలపై దృష్టి పెట్టాలన్నారు.


నీట్ లో బెస్ట్ ర్యాంక్..సాయం కోసం ఎదురుచూపు
తొర్రూరు, వెలుగు: నీట్ లో మెరుగైన ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కాలేజీలో చేరలేకపోతున్నాడు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం గోపాల్, లక్ష్మి దంపతుల కొడుకు కడెం రవి నీట్ లో 4117 ర్యాంక్ సాధించాడు. సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. ఫీజులు, పుస్తకాలకు ఏటా రూ.లక్ష ఖర్చు అవుతుండడంతో కూలి పని చేసుకునే తల్లిదండ్రులు కట్టలేకపోతున్నారు. దీంతో రవి కాలేజీలో చేరలేకపోయాడు. ఉన్నత విద్య కోసం దాతలు సహకరించాలని కోరారు. కాగా, సాయం చేయాలనుకునేవారు 93917 51331 నంబర్​ కు ఫోన్ చేయాలని స్థానికులు తెలిపారు.


రిలీఫ్ ఫండ్ లో బాధితులకు భరోసా
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడువటూరు గ్రామానికి చెందిన మినాలపురం చంద్రమౌళి అనారోగ్యంతో బాధపడుతుండగా.. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపురం కిరణ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందేలా చేశారు. మంగళవారం ఇందుకు సంబంధించిన రూ.2.50లక్షల ఎల్ వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మినాలపురం శ్రీనివాస్, ఉదయ్​కుమార్, స్వామి, సిద్దులు, విజయలక్ష్మి ఉన్నారు.

ఓరుగల్లుకు బంగ్లాదేశ్ మేయర్లు
కాశిబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వరంగల్ బల్దియా అవలంబిస్తున్న శానిటేషన్ విధానాలు బాగుతున్నాయని బంగ్లాదేశ్ మేయర్లు కితాబిచ్చారు. మంగళవారం వారంతా వరంగల్​నగరాన్ని సందర్శించారు. అమ్మవారిపేటలోని ఎఫ్​ఎస్​టీ ప్లాంట్, అంబేద్కర్ కాలనీలోని సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లను పరిశీలించారు. మల, వ్యర్థాల శుద్ధి విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం స్లమ్ ఏరియాల్లో పర్యటించి టాయిలెట్లు, మినీ పార్క్ లను చూశారు. ప్రజలతో మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. వరంగల్ బల్దియా విధానాలను తమ దేశంలోనూ అవలంబించేందుకు చర్యలు  తీసుకుంటామన్నారు.

స్టేషన్ ఘన్ పూర్ సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే రాజయ్య వినతిపత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్​లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేషన్ ఘన్ పూర్​లో 100 బెడ్ల ఆసుపత్రి, పోస్ట్ మార్టం గది మంజూరు చేయాలన్నారు. రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరు వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు  కేటాయించాలని కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు.

రిలయన్స్ దిష్టిబొమ్మ దహనం
స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: నగరాలు, పట్టణాల్లో సెలూన్ షాపులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ప్రయత్నిస్తోందని నాయీ బ్రాహ్మణులు ఆరోపించారు. మంగళవారం స్టేషన్​ఘన్​పూర్​లోని గాంధీ చౌరస్తాలో రిలయన్స్ సంస్థ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొరేట్ సంస్థలు పేదల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. రిలయన్స్ సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయీబ్రహ్మణ సంఘం మండలాధ్యక్షుడు కొలిపాక వేణు, జిల్లా గౌరవాధ్యక్షుడు కొలిపాక సతీశ్, పట్టణ అధ్యక్షుడు సతీశ్​తదితరులున్నారు.


ముగిసిన మందాడి అంత్యక్రియలు
అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

హనుమకొండ సిటీ, వెలుగు: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్​నేత మందాడి సత్యనారాయణ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం హనుమకొండ పద్మాక్షి టెంపుల్​సమీపంలోని శివముక్తి ధామ్ లో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మందాడి కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. అంతిమయాత్రలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, విజయ్ చందర్ రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.


‘తొలిమెట్టు’ను సక్సెస్ చేయాలి
భూపాలపల్లి అర్బన్, వెలుగు: విద్యా ప్రమాణాలు పెంపు కోసం ప్రభుత్వం ప్రారంభించిన తొలిమెట్టును సక్సెస్ చేయాలని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. మంగళవారం కలెక్టరేట్​లో ఈ ప్రోగ్రాంపై ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 363 ప్రభుత్వ బడుల్లో తొలిమెట్టు ప్రారంభమైందన్నారు. పిల్లలు చదువులో రాణించేలా బోధన అందించాలన్నారు. జాతీయ స్థాయిలో విద్య నాణ్యత ప్రమాణాలు 59% ఉంటే తెలంగాణలో కేవలం 28% మాత్రమే ఉండడం బాధాకరమన్నారు. టీచర్లు చిత్తశుద్ధితో పనిచేసి, మెరుగైన విద్య అందించాలన్నారు. ప్రతి విద్యార్థికి రాయడం, చదవడం, లెక్కలు చేయడం తెలియజేయాలన్నారు. వచ్చే నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు కనిపించాలన్నారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజేందర్, ఎంఈవోలు, హెఎంలు ఉన్నారు.


మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ షురూ
వర్చువల్ గా ప్రారంభించిన సీఎం కేసీఆర్
పాల్గొన్న కలెక్టర్, ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో నిర్మించిన మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. మంగళవారం మెడికల్ కాలేజీ భవనంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ శశాంక, జిల్లా వైద్యాధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ దీనిని ఓపెనింగ్ చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టినట్లు చెప్పారు. జనాభాకు తగ్గట్లుగా డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆన్ లైన్ లోనే క్లాసులు..
ప్రస్తుతం మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు పూర్తి అయినా.. ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉండడం, సిబ్బంది నియామకం జరగకపోవడంతో క్లాసులు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఈ ఏడాది 150 సీట్లకు గాను 92 మంది కౌన్సిలింగ్​ ద్వారా అడ్మిషన్లు పొందారని చెప్పారు. టీచింగ్ కోసం 9 మంది ప్రొఫెసర్లు, 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించామన్నారు. 20 మంది బోధనేతర సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక ప్రత్యక్ష క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. హాస్టల్​ దూరంగా ఉందని స్టూడెంట్లు భావిస్తే.. బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. మొదటి బ్యాచ్ స్టూడెంట్లు వైద్య విద్యలో రాణించి జిల్లా కీర్తిని పెంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, ఆర్డీవో కొమురయ్య, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎంహెచ్​వో హరీశ్​రాజు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​ వెంకట్రాములు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి తదితరులున్నారు.


ఆధునిక వ్యవసాయంతో లాభాలు
వరంగల్​సిటీ, వెలుగు: ఆధునిక వ్యవసాయంతోనే రైతులకు లాభాలు కలుగుతాయని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా కలెక్టర్ హాజరయ్యారు. రైతులు కొత్త పద్ధతుల్లో సాగు విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ మేళాకు వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల రైతులు అటెండై స్టాల్స్ ను పరిశీలించారు. కొత్త పరికరాల గురించి తెలుసుకున్నారు.

ములుకనూర్ సొసైటీకి విదేశీయులు
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ సొసైటీని మంగళవారం జర్ననీ, మలావి దేశస్తులు పర్యటించారు. త్రిదేశ ఒప్పందంలో భాగంగా వారు ఇక్కడికి వచ్చారు. ములుకనూర్ స్వకృషి మహిళా డైరీని పరిశీలించారు. సొసైటీ అధ్యక్షుడు  ఎ.ప్రవీణ్ రెడ్డి  పవర్ పాయింట్​ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి వివరించారు.

రిలయన్స్ దిష్టిబొమ్మ దహనం
స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: నగరాలు, పట్టణాల్లో సెలూన్ షాపులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ప్రయత్నిస్తోందని నాయీ బ్రాహ్మణులు ఆరోపించారు. మంగళవారం స్టేషన్​ఘన్​పూర్​లోని గాంధీ చౌరస్తాలో రిలయన్స్ సంస్థ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్పొరేట్ సంస్థలు పేదల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. రిలయన్స్ సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయీబ్రహ్మణ సంఘం మండలాధ్యక్షుడు కొలిపాక వేణు, జిల్లా గౌరవాధ్యక్షుడు కొలిపాక సతీశ్, పట్టణ అధ్యక్షుడు సతీశ్​తదితరులున్నారు.