కాంగ్రెస్​తోనే సీపీఐ..కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ.!

కాంగ్రెస్​తోనే సీపీఐ..కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ.!

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తోనే కలిసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు ఆ పార్టీ నేతలు ఓకే చెప్పినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి హైదరాబాద్​లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో సీపీఐకి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు ఇస్తామని రేవంత్ ఆఫర్ చేసినట్టు తెలిసింది. 

కొత్తగూడెం సీటు ఇవ్వాలని సీపీఐ నేతలు కోరగా, సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీనిపై హైకమాండ్​తో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నల్గొండ జిల్లా కమిటీ ఒత్తిడి మేరకు మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్​పై సీపీఐ ప్రతిపాదన చేయగా, దాన్ని రేవంత్ వ్యతిరేకించినట్టు తెలిసింది. మరోవైపు కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు స్పష్ట త రాకపోవడంతో సీపీఐలో ఆందోళన నెలకొంది. చివరి నిమిషం వరకు పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చి, చివర్లో సీటు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, కొత్తగూడెం సీటు ఇవ్వకపోయినా, కాంగ్రెస్​తోనే సీపీఐ కలిసివెళ్లే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇయ్యాల సీపీఎం అభ్యర్థుల ప్రకటన..

17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం... ఆదివారం అభ్యర్థులను ప్రకటించనుంది. ఉదయం 9 గంటలకు సీపీఎం స్టేట్​ఆఫీస్​లో మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విడుదల చేయనున్నారు.