నిజమైన దేశ భక్తులు కమ్యూనిస్టులే : నేత చాడ వెంకట రెడ్డి

నిజమైన దేశ భక్తులు కమ్యూనిస్టులే : నేత చాడ వెంకట రెడ్డి
  • `సీపీఐ జాతీయ నేత చాడ వెంకట రెడ్డి

నస్పూర్, వెలుగు: సీపీఐ వందేండ్ల ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. ఆసిఫాబాద్​ జిల్లా జోడేఘాట్​లో ప్రారంభమైన ‘బస్ జాత’ రెండో రోజు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్​కు చేరుకుంది. 

ఈ జాతకు నాయకత్వం వహిస్తున్న చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ వందేండ్ల ఉత్సవాల భారీ బహిరంగ సభ డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహిస్తామని, సక్సెస్ చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. దేశ భక్తులమని చెప్పుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. 

అధికారం కోసం అబద్ధపు మాటలను చెబుతూ కాలం వెళ్లదీస్తోందన్నారు. దేశంలో కమ్యూనిస్టుల బలం సన్నగి ల్లడం వల్లే బీజేపీ ఆటలు కొనసాగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ ప్రజల పక్షం కంటే సంపన్నుల పక్షమని ఎద్దేవా చేశారు. అధికారం లేకపోయినా సీపీపీ ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తోందన్నారు. 

ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించిన కామ్రేడ్ పి.నర్సయ్య సేవలు మరువలేనివని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ప్రజానాట్య మండలి పల్లె నరసింహ, డీఐఐపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, నాయకులు మేకల దాసు, జె.మల్లయ్య, కె.నగేశ్, లింగం రవి, బాజీ సైదా, రాజేశ్వర్ రావు, పి.రామన్న, కె.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.