స్థానిక పోరుకు రెడీ కావాలి : చాడ వెంకటరెడ్డి

స్థానిక పోరుకు రెడీ కావాలి :  చాడ వెంకటరెడ్డి
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలు
  • సీపీఐ రాష్ట్ర మహాసభల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ సన్నద్ధం కావాలని, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. మేడ్చల్‌‌‌‌ మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా గాజుల రామారంలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలో శుక్రవారం చాడ వెంకట రెడ్డి మాట్లాడారు. ఎర్రజెండా, సీపీఐ వద్దకు వెళ్తే తమకు నీడ (నివాస స్థలం) దొరుకుతుందనే నమ్మకం నేటికీ పేదల్లో ఉండటం పార్టీకి గర్వకారణమన్నారు. 

రాష్ట్రంలో ధరణి పోయి.. భూభారతి వచ్చినా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో  సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. గ్రామస్థాయిలో ఇంకా భూ సమస్యలున్నాయని, పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో నియతృంత్వ, ఫాసిస్టు పాలనను కొనసాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గలేదు: సత్యం

తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన మునుగోడు ఉపఎన్నికతో కమ్యూనిస్టుల ప్రాధాన్యం మరోసారి స్పష్టమైందని, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిందన్నవారికి ఈ ఎన్నిక సమాధానం లాంటిదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పదేండ్ల పాలనలో ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. బడుగు, బలహీన, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ కూనంనేని

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లు కొనసాగనున్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహను ఎన్నుకున్నారు. మేడ్చల్‌‌‌‌ జిల్లా గాజులరామారంలో సీపీఐ రాష్ట్ర 4వ మహాసభ చివరిరోజు శుక్రవారం నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. పది మంది కార్యదర్శివర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఎన్నికైంది. కార్యదర్శిగా కూనంనేని పేరును సీపీఐ సీనియర్‌‌‌‌ నేత పల్లా వెంకట్‌‌‌‌రెడ్డి ప్రతిపాదించగా.. మరోనేత కలవేన శంకర్‌‌‌‌ బలపర్చారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర సమితి ఏక్రగీవంగా ఆమోదించింది. అలాగే రాష్ట్ర సమితికి క్యాండిడేట్‌‌‌‌ సభ్యులు, ఆహ్వానితులను, రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులను కూడా ఎన్నుకున్నారు. నూతన నాయకత్వాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్‌‌‌‌ కె.నారాయణ, సయ్యద్‌‌‌‌ అజీజ్‌‌‌‌ పాషా అభినం దించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలో పేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.