
బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతిచ్చామని సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నిలబెట్టుకోవాలని, రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన వారికి 3 లక్షలు కాదు.. ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. ఈ నెల 21న ప్రజాసమస్యలపై మండల తహశీల్దార్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని చాడ వెల్లడించారు.
మంత్రుల మీద, ఎమ్మెల్సీ కవిత మీద జరుగుతున్న దాడులన్నీ కక్షపూరితంగా జరుగుతున్నట్లు అనిపిస్తోందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యవస్థతో ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని అభిప్రాయపడ్డారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని చాడ ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఇప్పటికే రాజ్ భవన్ ముట్టడించామని తెలిపారు. ఈనెల 29న దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్న డిమాండ్ తో సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని చాడ తెలిపారు.
ఆదానీ, అంబానీ లాంటి వ్యాపారులు మోడీ అండతో లక్షల కోట్లు సంపాదించారని చాడ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలనేతలపై దాడులు చేయిస్తున్నాన్నారు. ఒక్క బీజేపీ నేతలపై ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరగడం లేదని ప్రశ్ని్ంచారు. బీజేపీలో చేరితో బారాఖూన్ మాఫీ అన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్ష తరహా పాలన కోరుకుంటున్నాడని ఈ కుట్ర వెనుక ఆర్ఎఎస్ ఎస్ హస్తం ఉందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాడనికి అందరూ నడుం కట్టాలని చాడ సూచించారు. ఇక తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలని చాడ డిమాండ్ చేశారు. మత పిచ్చిగాళ్లకు తెలంగాణలో స్థానం లేదన్నారు.