గనులివ్వకుండా నష్టాల్లోకి నెట్టారు.. విశాఖ ఉక్కు అంశంపై ఎంపీలు గళం విప్పాలి

గనులివ్వకుండా నష్టాల్లోకి నెట్టారు.. విశాఖ ఉక్కు అంశంపై ఎంపీలు గళం విప్పాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాల వెనుక కేంద్రప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి కె. రామకృష్ణ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎంపీలను కలుస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు ఉద్యమం 810 రోజులకు పైగా జరుగుతోందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.గత ఏడాది 913 కోట్ల రూపాయల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్కు 2022-23లో 3049 కోట్లు నష్టం రావడం వెనక కేంద్రం కుట్ర ఉందని మండిపడ్డారు రామకృష్ణ.

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

నష్టాల సాకు చూపి విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు నరేంద్ర మోడీ సర్కార్ పావులు కదిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు సమిష్టిగా గళం విప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం ముందుకు సాగుతుండగా.. ఎలాగైనా అడ్డుకుని తీరుతామంటూ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు.. వీరి ఉద్యమానికి కార్మిక, ఉద్యోగ సంఘాలతో పాటు.. రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.