రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నేతలు

రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నేతలు

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్​తో సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్ భవన్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి సహా పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తొలుత సీపీఐ నాయకులు ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకొని రాజ్ భవన్ వైపునకు బయల్దేరారు. వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు నాయకులకు గాయాలయ్యాయి. అనంతరం సీపీఐ నేతలను అరెస్ట్ చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాల మల్లేశ్, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, కళవేన శంకర్, బాల నర్సింహ, బాగం హేమంత్ రావు, ఇ.టి.నరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలనే ఇబ్బంది పెట్టుడేంది: నారాయణ

అరెస్టయిన నేతలను నాంపల్లి పోలీస్ స్టేషన్ లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. కేంద్రం గవర్నర్లను అడ్డుపెట్టుకొని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ, కేరళ, తమిళనాడులో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ లో  నిర్మించనున్న డయాగ్నోస్టిక్ సెంటర్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ.. డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.