బాంబు దాడులు చేస్తున్న కేంద్రంపై గళమెత్తండి : సీపీఐ మావోయిస్టు పార్టీ

బాంబు దాడులు చేస్తున్న కేంద్రంపై గళమెత్తండి : సీపీఐ మావోయిస్టు పార్టీ

బస్తర్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గళమెత్తాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రకటించింది. ఈ మేరకు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ  కార్యదర్శి గంగ పేరుతో పత్రికా ప్రకట విడుదల చేసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలే లక్ష్యంగా బస్తర్ లో వైమానిక దాడులకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసులు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా పమేడ్, కిస్టారం సరిహద్దు ప్రాంతాలైన మడ్కన్‌గూడ మెట్టగూడ, బొట్టెటాంగ్, సకిలేర్, మడ్పాడులాడే, కన్నెమార్క, పొట్టేమంగుం, బొత్తలంక, రాసపల్లి, ఎర్రపాడ్ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఏప్రిల్ 15న కూడా ఈ ప్రాంతాల్లో దాడి జరిగిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది.  

పార్టీ నాయకత్వం, పీఎల్జీఏకు హాని కలిగించేందుకు బుధవారం ఉదయం నుంచి వైమానిక బాంబు దాడులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం, ఛత్తీస్ గఢ్ లోని ప్రజా, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం దాడులకు పాల్పడటాన్ని తప్పుబట్టింది. బాంబు దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారని, వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అభిప్రాయపడింది. వైమానిక దాడులకు వ్యతిరేకంగా దేశంలోని ప్రగతిశీల, ప్రజాస్వామ్య విప్లవ శక్తులు గళమెత్తాలని సీపీఐ మావోయిస్టు పార్టీ అభ్యర్థించింది.