‘డెడ్ లైన్లు వస్తాయి, పోతాయి. మీరు మాత్రం పట్టుదలగా ఉండండి’

‘డెడ్ లైన్లు వస్తాయి, పోతాయి. మీరు మాత్రం పట్టుదలగా ఉండండి’
  • కార్మికులకు అండగా మేమంతా ఉన్నాం
  • కేసీఆర్ మెడలు మోడీ, అమిత్ షా లు  వంచుతారు.
  • ఎంగిలి మెతుకుల కోసం మంత్రి పదవి పొంది ఛవాకులు పేలుతున్నారు
  • అసలైన తెలంగాణ వాదులు నోరు మెదపట్లేదు
  • చరిత్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిలిచిపోతుంది
  • కేసీఆర్ ఆయనకు ఆయనే డెడ్ లైన్ విధించుకుంటున్నాడు
  • హన్మకొండలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యలు

వరంగల్: ఆర్టీసీలో కేంద్రం వాటా 31 శాతం ఉందని.. ప్రైవేటు పరం చేస్తామంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే,  కేంద్రంలో ఉన్న మోడీ, షా లు కేసీఆర్ చెంపపై  కొడతారని ఆయన అన్నారు. కేసీఆర్ అమ్మ మొగుడు అమిత్ షా అని నారాయణ హెచ్చరించారు.

వరంగల్ జిల్లా హన్మకొండలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బలిదానాలు లేని తెలంగాణ కోరుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మహత్యల తెలంగాణ గా మార్చిందన్నారు.  ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రైవేటుపరం చేసి బస్సులు నడిపితే తమ శవాలపై చక్రాలు వెళ్లాలని ఆయన అన్నారు. డెడ్ లైన్లు వస్తాయి, పోతాయి. కార్మికులు మాత్రం పట్టుదలతో ఉండాలని నారాయణ అన్నారు. కార్మికులకు అండగా తామంతా ఉంటామన్నారు.

ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి, టి.ఆర్.ఎస్.లో చేరి, మంత్రి పదవులు పొందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులపై  అవాకులు, చవాకులు పలుకుతున్నారని, మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నారాయణ అన్నారు. అసలైన తెలంగాణవాదులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్ ఆర్టీసీ కార్మికులపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి వారసత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కార్మికవర్గం విజయం సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, చరిత్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిలిచిపోతుందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం కానేకాదని, చట్ట ప్రకారం ఇప్పటివరకు ప్రభుత్వం చర్చలు జరపలేదని అన్నారు. కేసీఆర్ ఆయనకు ఆయనే డెడ్ లైన్ విధించు కుంటున్నాడని అన్నారు నారాయణ.

CPI National Secretary Narayana Solidarity for RTC workers in Hanmakonda