- కార్పొరేషన్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పొత్తులకు ముందు వస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమర భేరి సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయని, నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలన్నారు.
60 డివిజన్లలో పోటీ చేసేందుకు సీపీఐ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని, పొత్తులతో కలిసి వచ్చే వారిని స్వాగతిస్తామని, లేకపోతే పంచాయితీ ఎన్నికల్లో మాదిరిగా ఒంటరి పోరుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. గత 20 ఏండ్లుగా పాల్వంచ మున్సిపల్ ఎన్నికలు జరగకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. వారి స్వలాభం కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ ప్రోగ్రాంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథం, వి.పూర్ణచంద్రరావు, మునిగడప వెంకటేశ్వర్లు, కంచర్ల జమలయ్య సలిగంటి శ్రీనివాస్, కందుల భాస్కర్, రాహుల్, ఫహీం పాల్గొన్నారు.
నెరవేరనున్న పాల్వంచవాసుల చిరకాల వాంఛ
పాల్వంచ : రెండున్నర దశా బ్దాలుగా పాల్వంచ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల వాంఛ నెరవేరబోతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం రాత్రి పాల్వంచలోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో కమ్మ సేవా సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రావూరి నాగేశ్వర రావు, సాయిని కోటేశ్వరరావు, హరి సత్యనారాయణ, అనంతరాములు, రోజా రాణి, బుల్లెయ్య తదితరులు పాల్గొన్నారు.
