
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఐ శత జయంతి వేడుకలను ఖమ్మం కేంద్రంగా డిసెంబర్ 26న భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు ఆ పార్టీ స్టేట్సెక్రటరీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన చుంచుపల్లి మండల మహాసభలో ఆయన మాట్లాడారు. శత జయంతి వేడుకలను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని కమ్యూనిస్టు యోధులు వేడుకలకు హాజరవుతారని చెప్పారు. 1964 వరకు కమ్యూనిస్టులు కలిసే ఉన్నారరని, ఆ తర్వాతే చీలికలు వచ్చాయని, ఇప్పటికైనా కమ్యూనిస్టులు ఏకమైతే రాజ్యం తమదే అవుతుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కగార్ పేరుతో మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతోందని ఆరోపించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొనడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సెక్రటరీ ఎస్కె. సాబీర్ పాషా, నేతలు దుర్గారాశి వెంకన్న, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, చంద్రగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.