పాశమైలారం ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్

పాశమైలారం ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి :  సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
  • సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

సంగారెడ్డి టౌన్, వెలుగు: పటాన్ చెరు నియోజకవర్గం పాశమైలారంలోని  సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, తక్షణమే మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. రాములు మాట్లాడుతూ పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు,  రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

 శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.50 లక్షలు, గాయపడ్డ వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.11 కుటుంబాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ సూపరింటెండెంట్​కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు, విద్యాసాగర్, కృష్ణ, పాండురంగారెడ్డి, నరసింహారెడ్డి, బాగారెడ్డి, నాగభూషణం, బాలరాజు, విట్టల్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.