- సీఎంకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేయకపోవడంతో బ్యాంకుల్లో అసలు, వడ్డీలు పేరుకుపోతున్నాయని, దీనికి తోడు ప్రైవేటు అప్పుల భారం పెరిగి చేనేత కుటుంబాలు చితికిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. చేనేత కార్మికుల రుణ మాఫీ, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడారు.
రుణమాఫీ కోసం రూ.48 కోట్లు వెంటనే విడుదల చేయాలని, సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలని కోరారు. పెట్టుబడి సాయం కింద జీరో వడ్డీతో రూ.5లక్షల కొత్తరుణం ఇవ్వాలన్నారు. చేనేత భరోసా పథకంలో జియోట్యాగ్ ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రూ.2వేలు, అనుబంధ కార్మికులకు ఇద్దరికి కలిపి రూ.1000లు ఇవ్వాలని, జియోట్యాగింగ్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని వీటితోపాటు పెండింగ్సమస్యలను పరిష్కరించాలని కోరారు.
