- ఎఫ్‌సీఐ లేఅవుట్లలో ప్లాట్లు ఆక్రమించి భవనాలు నిర్మించిన కన్స్ట్రక్షన్ ఎండీ శ్రీధర్
- గతంలో హైడ్రా చర్యలు తీసుకున్నా మరోసారి నిర్మాణాలు
- హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో సంధ్య కన్‌స్ర్టక్షన్స్ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. ఎఫ్‌సీఐ లేఅవుట్లో రోడ్లు, ప్లాట్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో 1981లో 20 ఎకరాల్లో ఎఫ్‌సీఐ కోఅపరేటివ్ హౌజింగ్ సొసైటీ లేఅవుట్ చేసి ఆ సంస్థలో పనిచేసే వారికి 162 ప్లాట్లు కేటాయించింది. ఈ లేఅవుట్‌ను ఆనుకొని సంధ్య కన్వెన్షన్ ఉండగా, ఎండీ శ్రీధర్ కొన్ని ప్లాట్లను కొనుగోలు చేసి మిగతా ప్లాట్ల హద్దులను చెరిపేశాడు.
దీంతో 119 మంది బాధితులు ఆయనకే ప్లాట్లు అమ్ముకున్నారు. మరో 43 ప్లాట్లను శ్రీధర్‌రావు కబ్జా చేసి భవనాలు నిర్మించాడు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు మే 7న పలు నిర్మాణాలను కూల్చివేశారు. అయినా శ్రీధర్ మరోసారి నిర్మాణాలు చేపట్టాడు. ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు భారీ హైడ్రాలిక్ యంత్రంతో ఎఫ్‌సీఐ లేఅవుట్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. 40 అడుగుల రోడ్డును ఆక్రమించి చేపట్టిన 4 అంతస్తుల బిల్డింగ్, భారీ ఫుడ్ కోర్టు, మెయిన్ రోడ్డు వెంట ఉన్న పెట్రోల్ బంకు, 25 ఫీట్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన 40 ఫుడ్ కంటైనర్లను, ఓ దవాఖాన కోసం నిర్మిస్తున్న బిల్డింగ్ స్లాబ్‌లను కూల్చివేశారు. త్వరలోనే ఎఫ్‌సీఐ లేఅవుట్ రోడ్లు, ప్లాట్లను పునరుద్ధరించి హద్దులు ఏర్పాటు చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.
