ముందుకా..? వెనక్కా..? కన్‌ఫ్యూజన్‌లో కామ్రేడ్లు

ముందుకా..? వెనక్కా..?  కన్‌ఫ్యూజన్‌లో కామ్రేడ్లు
  • భువనగిరి అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం
  • పొత్తులో ఒక్కసీటైనా ఇవ్వాలంటున్న సీపీఐ
  • పట్టించుకోని కాంగ్రెస్.. అభ్యర్థుల ఖరారుపై నే దృష్టి 

హైదరాబాద్: ఊరిడిసి పోదునా.. ఉరిపోసుకు సద్దునా..? అన్న చందంగా తయారైంది కామ్రేడ్ల పరిస్థితి.. ఇటు కాంగ్రెస్ ను విభేదించి వెళ్లలేక.. అటు కారెక్కలేక కొడవళ్లు కన్ ఫ్యూజన్ లో పడిపోయాయి. సీపీఎం అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ తో, బీఆర్ఎస్ తో సమాన దూరం పాటిస్తోంది. 14 చోట్ల పోటీ చేసిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేక పోవడం గమనార్హం. కాంగ్రెస్ తో దోస్తీ కట్టి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది సీపీఐ. నాలుగు సీట్లు కావాలని అడిగిన  సీపీఐకి కేవలం కొత్తగూడెం స్థానం పొత్తులో భాగంగా దక్కింది. అక్కడి నుంచి బరిలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు విజయం సాధించాడు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా కొనసాగుతోంది సీపీఐ. ఇదే తరునంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో మరో మారు కాంగ్రెస్ ఆఫర్ కోసం ఎదురు చూసింది సీపీఎం. హస్తం వైపు నుంచి ఎలాంటి అభయం రాకపోవడంతో భువనగిరి నుంచి ఏకంగా క్యాండిడేట్ నే ప్రకటించింది. 

ఇదిలా ఉండగా వరంగల్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న సీపీఐ ఆశలు గల్లంతయ్యాయి. ఇక్కడి నుంచి జర్నలిస్టు లెనిన్ ను బరిలోకి దించేందుకు సీపీఐ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. దీనికి తోడు అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరడం.. ఏఐసీసీ ఆమెకు టికెట్ కేటాయించింది. దీంతో ఆ స్థానంపై ఆశలూ సన్నగిల్లాయి. ఇటీవల ముగ్ధూం భవన్ లో సీపీఐ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కనీసం ఒక్క సీటైనా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒక్క సీటు కూడా సీపీఐకి ఇచ్చే అవకాశం లేదు. దీంతో  ఏం చేద్దామనే కన్ ఫ్యూజన్ లో పడిపోయారు కామ్రేడ్లు.