
- పేదలపై భారం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు
- పొలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, బీవీ రాఘవులు
- కల్తీ కల్లు ఘటనపై సీఎం స్పందించాలి
హైదరాబాద్, వెలుగు: యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ విమర్శించారు. మోదీ పాలనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో శనివారం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, జ్యోతితో కలిసి విజయ రాఘవన్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తూ పేదలపై భారం మోపుతున్నదన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ అధికంగా ఉందని, కార్పొరేట్ పన్నును మాత్రం కేంద్రం తగ్గించిందన్నారు.
అమెరికా టారిఫ్ లపై ఇండియా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పని వేళలను 8 నుంచి10 గంటలకు పెంచుతూ రేవంత్ సర్కార్ 282 జీవో తీసుకురావడం దురదృష్టకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కల్తీ కల్లు ఘటనపై సీఎం స్పందించాలన్నారు. బసవతారకం నగర్ లో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలుస్తామని, బలం ఉన్న చోట ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.