జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం
  • ఇండియా కూటమిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
  • సీపీఎంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని వెల్లడి

నాగర్ కర్నూల్  టౌన్, వెలుగు : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇండియా కూటమిని నిర్వీర్యం చేసేందుకే జమిలి ఎన్నికల పేరుతో కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ఆయన తెలిపారు. సోమవారం సీపీఐ జాతీయ నేత ఎం.లింగారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నాగర్  కర్నూల్  పట్టణ శివారులో ఏర్పాటు చేసిన స్తూపాన్ని  కూనంనేని ఆవిష్కరించి మాట్లాడారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దేశంలో, రాష్ట్రంలో సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే జమిలి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

రాబోయే ఎన్నికల్లో సీపీఎంతో కలిసి బరిలోకి దిగుతామని ఆయన వెల్లడించారు. మొదటి దశలో ఐదు స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్  వ్యతిరేక పార్టీలు ముందుకు వస్తే వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్  పార్టీ గతంలో అంతర్గతంగా సమావేశం నిర్వహించిందని, వారి విధివిధానాలు, ప్రతిపాదనలను తెలపాలని కోరినట్లు చెప్పారు. ఆ తరువాత వాళ్లు చర్చలు జరపలేదన్నారు. పేద ప్రజల అజెండాగా కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు.