కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..

వికారాబాద్ జిల్లా : కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ జిల్లాలో సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. పరిగి తహశీల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన సీపీఎం నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి, తహశీల్దార్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రంగాపూర్ సమీపంలో సర్వే నంబర్ 18లోని దాదాపు 10 ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ తహశీల్దార్ తో వాగ్వాదానికి దిగారు. 

రంగాపూర్ లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి : సీపీఎం

స్థానిక టీఆర్ఎస్ నాయకుల సహకారంతో హైదరాబాద్ కు చెందిన హైమద్ ఖాన్ అనే వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట 9ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయ్యింది. అప్పటి నుంచి ఈ భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని భావించిన సీపీఎం నాయకులు లోక్ పాల్ లో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో భూమి రీ సర్వే చేసి వివరణ ఇవ్వాలని అప్పటి కలెక్టర్ కు, రెవెన్యూ సిబ్బందిని లోక్ పాల్ ఆదేశించింది. రీ సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అయినప్పటికీ ప్రభుత్వ భూమిని హైమద్ ఖాన్ స్వాధీనం చేసుకోవడంపై సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రంగాపూర్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తామని, దరఖాస్తు చేసుకోవాలని పిలుపునివ్వడంతో పరిగికి చెందిన స్థానికులు భారీ ఎత్తున తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. వారందరితో కలిసి సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలంటూ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన జనాలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. అయితే..ఉన్నతాధికారలతో మాట్లాడి సాయంత్రం వరకూ సమస్యను పరిష్కరిస్తామని పరిగి తహశీల్దార్ హామీ ఇవ్వడంతో సీపీఎం నాయకులు ఆందోళన విరమించారు.