- తొందరలోనే హెల్ప్ లైన్ సెంటర్లు
- సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం
పేదలు, ఒకే గదిలో ఉండే వారి కోసం సీపీఎం ఆఫీసుల్లో కరోనా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర సెక్రటరీ తమ్మినేని వీరభద్రం తెలిపారు. కరోనా బాధితులకు అండగా నిలవాలనీ, సహాయ కార్యక్రమాలు చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. రాఘవులు, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... కరోనా బాధితులకు వైద్యం, సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్కారు హాస్పిటల్స్‌లో సరైన ట్రీట్ మెంట్ అందడం లేదని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు హాస్పిటల్స్ పేషెంట్లను దోచుకుంటున్నాయన్నారు. హైదరాబాద్‌ను రాష్ట్ర కేంద్రంగా ఉంచి జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా హెల్ప్ లైన్ సెంటర్లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. కరోనా దృష్ట్యా మే డే ప్రోగ్రామ్‌ల్లో తక్కువ మంది ఉండేలా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
