బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌

బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌కు గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌

ఆర్మీ హెలికాప్టర్‌‌ ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ మృత్యువుతో పోరాడుతున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆయనను వెల్లింగ్టన్‌ ఆర్మీ హాస్పిటల్‌ నుంచి బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌కు మార్చారు. నిన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు హెలికాప్టర్‌‌లో ప్రయాణిస్తుండగా తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించగా.. ఒక్క వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించాలని ఆర్మీ డాక్టర్లు నిర్ణయించారు. లైఫ్ సపోర్ట్‌పై ఉన్న ఆయనను అంబులెన్స్‌లో సూలూరు ఎయిర్‌‌బేస్‌ వరకూ తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకెళ్లారు. 

వెల్లింగ్టన్‌ నుంచి బెంగళూరులోని కమాండ్ హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో వరుణ్ సింగ్ వెంట ఆయన తండ్రి రిటైర్డ్ కల్నల్ కేపీ సింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలిసి వెల్లింగ్టన్‌ వచ్చిన కేపీ సింగ్.. తన కుమారుడు ఒక పోరాట యోధుడని అన్నారు. అయితే వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు మాత్రం వరుణ్ సింగ్ పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, అయితే ప్రస్తుతం ఆయన కండిషన్ స్టేబుల్‌గా ఉందని చెప్పారు.