గ్రేటర్​లో పెరుగుతోన్న పెట్ పేరెంటింగ్

గ్రేటర్​లో పెరుగుతోన్న పెట్ పేరెంటింగ్
  • పెట్ ఫ్రెండ్లీ ప్లేస్​లకు మస్తు క్రేజ్
  • గ్రేటర్​లో పెరుగుతోన్న పెట్ పేరెంటింగ్ 
  • అందుబాటులో యాప్​లు
  • ఒత్తిడి, ఒంటరితనమే కారణమంటున్న సైకాలజిస్టులు

‘‘ఒకప్పుడు కుక్కలున్నాయంటే అటు పక్కకు కూడా వెళ్లేదాన్ని కాదు. కానీ గతేడాది ఓ కుక్క పిల్లను మా కజిన్ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అది మా ఇంట్లో మెంబర్ అయిపోయింది. ఎంత వర్క్  ప్రెజర్‌‌‌‌లో ఉన్నా దాంతో కాసేపు ఆడుకుంటే స్ట్రెస్‌‌ పోతుంది.” అని కేపీహెచ్‌‌బీకి చెందిన ప్రైవేట్ ఎంప్లాయి శిరీష చెబుతోంది.

హైదరాబాద్, వెలుగు: పెంపుడు జంతువులను పెంచుకోవడం ఎప్పటినుంచో ఉన్నా ఈ మధ్య కాలంలో అది చాలా పెరిగింది. అందుకు కారణం జనాల్లో యాంగ్జైటీ, లోన్లీనెస్, ప్రెజర్ ఎక్కువ కావడమేనని సైకాలజిస్టులు చెప్తున్నారు. చాలామంది చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్​లోకి వెళ్లిపోతుంటారు. దాని నుంచి బయటపడేందుకు పెట్స్​ను పెంచుకుంటున్నారు. దీంతో  మానసిక ప్రశాంతతతో పాటు బాధ్యత కూడా తెలుస్తుందని వారు చెప్తున్నారు. తాము ఎక్కడికెళ్తే అక్కడికి పెట్స్ ను తీసుకెళ్తున్నారు. దీంతో సిటీలో కొత్తగా పెట్స్ ఫ్రెండ్లీ ప్లేసులు కూడా పుట్టుకొస్తున్నాయి. 

సోషల్ మీడియాలో ఫొటోల షేరింగ్..

చాలామంది తమ పెట్స్‌‌కు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్ లాంటి యాప్స్ లో స్పెషల్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు.  అందులో వాటి 
డీటెయిల్స్​తో పాటు ‘ఐయామ్ పెట్ పేరెంట్’ ట్యాగ్​ను పెడుతున్నారు. పెట్స్ ఫొటోలు,   వీడియోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు.  సిటీలో ఎక్కడెక్కడ పెట్స్‌‌కు అనువైన ప్రాంతాలున్నాయో యాప్‌‌ల ద్వారా కూడా తెలుసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు సిటీలోని చాలా కెఫేలు, రెస్టారెంట్లు తమ స్టోర్ పెట్ ఫ్రెండ్లీ అని ముందే సమాచారం ఇచ్చేస్తున్నాయి.  దీంతో పెట్స్‌‌కి సంబంధించిన గ్రూమింగ్, క్లినిక్స్, వస్తువుల స్టోర్‌‌‌‌లు కూడా పెరుగుతున్నాయి. యాప్‌‌లు, వెబ్‌‌సైట్లలో పెట్ పేరెంటింగ్‌‌కి సంబంధించి టిప్స్‌‌ను అందిస్తున్నాయి. పెట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ దొరికే పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాయి.

పెరిగిన సేల్స్.. 

గతంతో పోలిస్తే కరోనా టైమ్​లో, ప్రస్తుతం పెట్స్ సేల్స్ పెరిగాయని స్టోర్ నిర్వాహకులు చెప్తున్నారు. సిటీలో పెట్స్ అండ్ కెనెల్స్ స్టోర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి.  చాలా స్టోర్ల ఓనర్లు అన్ని రకాల బ్రీడ్స్ ను అమ్ముతున్నారు.  గతంలో ఒక పెట్ స్టోర్‌‌‌‌లో వారానికి 5  నుంచి 10 పెట్స్ అమ్ముడైతే, కరోనా టైమ్​లో ఆ సంఖ్య 20 నుంచి 25కు చేరింది. ప్రస్తుతం వారానికి చిన్న స్టోర్లలో  10 నుంచి 15 సేల్స్, పెద్ద స్టోర్లలో 20 నుంచి 30 పెట్స్ అమ్మకాలు జరుగుతున్నాయని ఓనర్లు అంటున్నారు. ఒకప్పుడు గోల్డెన్ రిట్రైవర్, జర్మన్ షఫర్డ్, పిట్ బుల్, లాబ్రాడార్ లాంటివి ఎక్కువ అమ్ముడుపోతే కరోనా టైమ్  నుంచి సైబీరియన్  హస్కీ డాగ్, చౌచౌ, మినీ పమేరియన్ జాతులకు చెందిన కుక్కలను కొనేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని  స్టోర్ ఓనర్లు చెప్తున్నారు.  వీటి ధరలు రూ. 50వేల నుంచి రూ. 70వేల వరకు ఉన్నాయన్నారు. 

ఆలోచన మారింది..

ఒకప్పటితో పోలిస్తే పెట్స్ కొనాలనే ఆలోచన జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా టైమ్​లో చాలా ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. అంతకుముందు వరకు ఐదారు అమ్మితే అప్పుడు ఏకంగా 25 నుంచి 30 వరకు పెట్స్​ను అమ్మాం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా కొనడం  సంతోషంగా అనిపిస్తోంది. పిల్లలు ఉద్యోగాలకు, మనువళ్లు, మనవరాళ్లు తమ స్టడీస్‌‌లో బిజీగా ఉంటే సీనియర్ సిటిజన్లు పెట్స్ తో కాలక్షేపం చేస్తున్నట్లు మాతో చెప్తున్నారు.  ప్రస్తుతం వారానికి 10 నుంచి 15 పెట్స్ ను అమ్ముతున్నాం. పక్షుల కంటే ఎక్కువగా డాగ్స్, క్యాట్స్ ను కొంటున్నారు.

‌‌‌‌- మోయిన్, అమ్ముస్ పెట్స్ అండ్ కెనెల్స్ స్టోర్ ఓనర్, పంజాగుట్ట