
న్యూఢిల్లీ: ఇండియా కొత్త జీఎస్టీ విధానంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా, ఇన్సూరెన్స్ కంపెనీలు బ్రోకరేజ్, కమిషన్ వంటి సేవలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేయలేవని స్పష్టం చేసింది.
రీ-ఇన్సూరెన్స్ సేవలు మినహాయింపు పొందినప్పటికీ, మిగతా సేవలపై ఐటీసీ రద్దు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బీమా సంస్థల ఖర్చులు పెరిగి, ప్రీమియం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా, కొత్త జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయి. సాధారణ వస్తువులకు 5శాతం లేదా 18శాతం జీఎస్‌టీ పడనుండగా, “సిన్” కేటగిరీలోని వస్తువులపై 40 శాతం పడుతుంది. ఉదాహరణకు తంబాకు, ఆల్కహాల్‌కు ఈ రేటు వర్తిస్తుంది.
మరిన్ని అంశాలు..
* నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకారం, సెప్టెంబర్ 22కి ముందు సరఫరాలో ఉన్న ఔషధాలను తిరిగి లేబులింగ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలు సవరించిన ధరల జాబితాను ప్రకటించాలి.
* రూ.7,500 లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న హోటల్ గదులకు 5శాతం జీఎస్‌టీ మాత్రమే వర్తిస్తుంది. ఐటీసీ క్లెయిమ్ చేసే అవకాశం లేదు.
* అన్ని రకాల డ్రోన్లపై ఒకే 5శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. గతంలో వ్యక్తిగత డ్రోన్లపై 28శాతం, కెమెరా ఉన్న వాటిపై 18శాతం పడేది.
* బ్యూటీ, వెల్‌నెస్ సేవలపై 5శాతం జీఎస్‌టీ మాత్రమే పడుతుంది. ఐటీసీ క్లెయిమ్ చేసే అవకాశం లేదు.
* ఆపరేటర్ లేకుండా అందించే లీజు, రెంట్ సర్వీస్‌లపై సంబంధిత వస్తువుపై పడే జీఎస్‌టీ రేటే పడుతుంది. ఉదా. కారుపై 18 శాతం పడితే దీన్ని ఆపరేటర్ లేకుండా లీజుకు, రెంట్‌కి ఇస్తే 18శాతమే ఈ సర్వీస్‌పై పడుతుంది. అదే డ్రైవర్ వంటి ఆపరేటర్‌తో లీజుకిస్తే 5శాతం ట్యాక్స్ పడుతుంది. ఐటీసీ ఫుల్‌గా అందదు. 18శాతం ట్యాక్స్ రేటుతో ఫుల్ ఐటీసీ పొందొచ్చు.