
హైదరాబాద్, వెలుగు: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్– హైదరాబాద్), బోటిక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అప్‌వైజరీ హైదరాబాద్‌లో సోమవారం రియల్ ఎస్టేట్ (ఆర్‌ఈ) ఫోకస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించింది. నగరంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, మార్కెట్లో అవకాశాల గురించి అప్‌వైజరీ ఎక్స్పర్టులతోపాటు, మార్క్యూ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల ఎక్స్పర్టులు, ఫండ్ మేనేజర్లు వివరించారు. మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్స్ సీఈఓ శరద్ మిట్టల్, సుందరం ఆల్టర్నేట్స్ డైరెక్టర్ కార్తీక్ ఆత్రేయ, టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ క్రెడిట్ & రిస్క్ హెడ్ - వైభవ్ అగర్వాల్, టిష్మాన్ స్పేయర్ ఇండియా కంట్రీ హెడ్ పర్వేష్ శర్మ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 150 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, 20కి పైగా గ్లోబల్, దేశీయ ఆర్థిక సంస్థలు, ఫండ్ కంపెనీలు కూడా పాల్గొన్నాయి.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామ కృష్ణారావు, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మోతీలాల్ ఓస్వాల్ ఆర్‌ఈ ఫండ్‌కు చెందిన శరద్ మిట్టల్ మాట్లాడుతూ, "మా ఫండ్ గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో 15 కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టింది. మా కొత్త పెట్టుబడులలో ఎక్కువ భాగం ఇక్కడి మార్కెట్ కోసమే కేటాయిస్తాం. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. కాస్మోపాలిటన్ సంస్కృతి ఉంది”అని అన్నారు. సుందరం ఆల్టర్నేట్స్‌కి చెందిన కార్తీక్ మాట్లాడుతూ హైదరాబాద్ మార్కెట్ వల్ల తాము ఎంతో వృద్ధి చెందామని, తమ ప్రాజెక్ట్‌లను విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు. స్థూల ఆర్థిక వాతావరణం గురించి టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ హెడ్ వైభవ్ అగర్వాల్ మాట్లాడుతూ, "మూలధన వ్యయం, వడ్డీ రేట్లు సమీప కాలంలో ఎక్కువగానే ఉండవచ్చు. దీనివల్ల ప్రాజెక్ట్ ఖర్చులు పెరుగుతాయి. అయితే హైదరాబాద్‌లో ఇండ్లకు డిమాండ్ కొనసాగుతుంది”
అని వివరించారు.