
అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కస్టమర్ల భద్రతే లక్ష్యంగా ఆర్బీఐ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. న్యూ రూల్స్ ప్రకారం ఆన్లైన్ వ్యాపారులు కస్టమర్ వివరాలను స్టోర్ చేయకూడదు. ఈ రూల్స్ను కంపెనీలు అక్టోబర్1 నుంచి అమలు చేయనున్నాయి. దీంతో కస్టమర్లు సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేసుకునేందుకు వీలుంటుంది. దేశీయ ఆన్లైన్ కొనుగోళ కోసం ఆర్బీఐ కార్డ్ ఆన్ ఫైల్ టోకెన్ విధానాన్ని తప్పనిసరి చేసింది.
కార్డ్ ఆన్ ఫైల్ విధానంలో కార్డు వివరాలు ఎన్క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఈ టోకెన్ల సాయంతో కస్టమర్లు కార్డు వివరాలను వెల్లడించకుండానే ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఒరిజినల్ కార్డు డేటా స్థానంలో ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్ను తీసుకోవాలి. ఈ టోకెన్ పొందాలంటే చెల్లింపు జరిపే సైట్లో టోకెన్ రిక్వెస్టర్ కు అభ్యర్థన పెట్టుకోవాలి. ఈ సంస్ధ మీ అభ్యర్థనను మీ కార్డు నెట్ వర్క్ కు పంపిస్తుంది. కార్డు జారీదారు సమ్మతితో టోకెన్ను కార్డు నెట్ వర్క్ సంస్థ జారీ చేస్తుంది. ఇలా కార్డు వివరాలకు బదులుగా టోకెన్ ఇవ్వడాన్ని టోకనైజేషన్ అంటారు.
అయితే కార్టు టోకనైజేషన్ సిస్టమ్ తప్పనిసరి కాదు. కావాలనుకుంటే కస్లమర్లు కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసుకోవొచ్చు. కేవలం దేశీయ ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే టోకనైజేషన్ వర్తిస్తుంది. టోకనైజేషన్ వల్ల సైబర్ మోసగాళ్ల చేతిలోకి కార్డు వివరాలు వెళ్లకుండా అడ్డుకట్టవేసినట్లవుతుంది.