క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌పై గురి.. వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా రెండో టెస్ట్‌‌‌‌.. తొలి టెస్ట్‌‌‌‌ జట్టుతోనే గిల్‌‌‌‌సేన బరిలోకి..

క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌పై గురి.. వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా రెండో టెస్ట్‌‌‌‌.. తొలి టెస్ట్‌‌‌‌ జట్టుతోనే గిల్‌‌‌‌సేన బరిలోకి..
  • తొలి టెస్ట్‌‌‌‌ జట్టుతోనే గిల్‌‌‌‌సేన బరిలోకి
  • జెడియా బ్లేడ్స్‌‌‌‌కు విండీస్‌‌‌‌ చాన్స్‌‌‌‌!
  • ఉ. 9.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో లైవ్‌‌‌‌

న్యూఢిల్లీ: తొలి టెస్ట్‌‌‌‌లో భారీ విజయంతో ఊపుమీదున్న టీమిండియా... వెస్టిండీస్‌‌‌‌తో రెండో మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. నేటి నుంచి జరిగే ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌  పాయింట్ల పట్టికలో పట్టును పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ ఏడాది చివర్లో సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే కఠినమైన సిరీస్‌‌‌‌కు కావాల్సినంత ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలని యంగ్‌‌‌‌ టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్ట్‌‌‌‌లో ఆడిన జట్టును యధావిధిగా బరిలోకి దించాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో టీమిండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ అంత లోతుగా ఏ జట్టుది లేదు. దాంతో సీమ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌కు మరో చాన్స్‌‌‌‌ లభించనుంది. భవిష్యత్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని అతన్ని కొనసాగించాలని హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ భావిస్తున్నాడు. 

గత ఏడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఆరింటిలో ఫెయిలైన సాయి సుదర్శన్‌‌‌‌ గురించి సెలెక్టర్లు, కోచ్‌‌‌‌ పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఏదో ఓ రోజు తన సత్తా చూపెడతాని నమ్మకం పెట్టుకున్నారు. ఓపెనింగ్‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌కు తిరుగులేదు. రాహుల్‌‌‌‌ తన చివరి ఆరు టెస్ట్‌‌‌‌ల్లో  మూడు సెంచరీలు చేసి కెరీర్‌‌‌‌లోనే అత్యుత్తమ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. కెప్టెన్‌‌‌‌ గిల్‌‌‌‌ కూడా హాఫ్‌‌‌‌ సెంచరీతో దూకుడు మీదున్నాడు. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, జడేజా కూడా బ్యాటింగ్‌‌‌‌లో మరోసారి మెరిస్తే ఇండియా భారీ స్కోరు చేయడం ఖాయం. స్పిన్నర్లుగా సుందర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ పక్కా. వర్క్‌‌‌‌ లోడ్‌‌‌‌ దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని భావించినా దాని గురించి ఆలోచించడం లేదు. సిరాజ్‌‌‌‌తో కలిసి అతను కొత్త బంతిని పంచుకోనున్నాడు.

తుది జట్లు (అంచనా):
ఇండియా: శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, రవీంద్ర జడేజా, నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌.


వెస్టిండీస్‌‌‌‌: రోస్టన్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), టాగెనరైన్ చందర్‌‌‌‌పాల్‌‌‌‌, జాన్‌‌‌‌ క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌, అలిక్‌‌‌‌ అథనాజె, బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌, షాయ్‌‌‌‌ హోప్‌‌‌‌, జస్టిన్‌‌‌‌ గ్రీవ్స్‌‌‌‌, జోమెల్‌‌‌‌ వారికాన్‌‌‌‌, ఖారీ పియరీ, జోహన్ లేన్/ జెడియా బ్లేడ్స్, జైడెన్‌‌‌‌ సీల్స్‌‌‌‌.

గెలుపు పైనే దృష్టి..
టీమిండియాతో పోలిస్తే విండీస్‌‌‌‌ చాలా అంశాల్లో బలహీనంగా కనిపిస్తోంది. తొలి టెస్ట్‌‌‌‌లో ఇన్నింగ్స్‌‌‌‌ తేడాతో ఓడటమే ఇందుకు నిదర్శనం. ప్లేయర్లు, టెక్నిక్‌‌‌‌ పరంగా చాలా బలహీనంగా ఉండటంతో ఈ మ్యాచ్‌‌‌‌పై కరీబియన్లలో పెద్దగా సందడి కనిపించడం లేదు. కానీ తొలి టెస్ట్‌‌‌‌ ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం విండీస్‌‌‌‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వివియన్‌‌‌‌ రిచర్డ్స్‌‌‌‌, రిచీ రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌, బ్రియాన్‌‌‌‌ లారాతో ఓ గోల్ఫ్‌‌‌‌ కోర్స్‌‌‌‌లో అనధికారికంగా సమావేశమయ్యారు. కనీసం ఈ లెజెండ్స్‌‌‌‌ మాటలతోనైనా విండీస్‌‌‌‌ పోటీ ఇస్తుందా? చూడాలి. బౌలింగ్‌‌‌‌ పదును పెంచడానికి తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జైడెన్‌‌‌‌ సీల్స్‌‌‌‌, వారికాన్‌‌‌‌ మరోసారి కీలకం కానున్నారు. వీళ్లకు తోడుగా జెడియా బ్లేడ్స్‌‌‌‌ను తుది జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. 

ఒకవేళ ఇండియా మొదట బ్యాటింగ్‌‌‌‌ చేస్తే తక్కువ స్కోరుకు కట్టడి చేయాలని బౌలింగ్‌‌‌‌ వ్యూహాలు రచిస్తున్నారు. తొలి టెస్ట్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 162 రన్స్‌‌‌‌కే కుప్పకూలిన బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌పై కూడా దృష్టి సారించారు. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో చందర్‌‌‌‌పాల్‌‌‌‌, క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌, అథనాజె గాడిలో పడితే స్కోరును ఆశించొచ్చు. మిడిలార్డర్‌‌‌‌లో బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌, ఛేజ్‌‌‌‌, హోప్‌‌‌‌ భారీ స్కోర్లపై దృష్టి సారించాలి. ఓవరాల్‌‌‌‌గా ఇండియా బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌ను తట్టుకుని ఈ మ్యాచ్‌‌‌‌లో గెలవాలంటే విండీస్‌‌‌‌కు ఆటతో పాటు అదృష్టం కూడా తోడుగా నిలవాల్సిందే. 

  • 10 టెస్ట్‌‌‌‌ల్లో 4 వేల రన్స్‌‌‌‌కు జడేజా పది పరుగుల దూరంలో ఉన్నాడు. అతని కంటే ముందు ఇయాన్‌‌‌‌ బోథమ్‌‌‌‌, కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌, డేనియల్‌‌‌‌ వెటోరీ మాత్రమే 4 వేల రన్స్‌‌‌‌, 300 వికెట్లు సాధించారు.
  • 12 1987 నవంబర్‌‌‌‌ తర్వాత ఢిల్లీలో టీమిండియా ఒక్క టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కూడా ఓడలేదు. యాదృచ్ఛికంగా అప్పుడు విండీస్‌‌‌‌ చేతిలోనే ఓడటం గమనార్హం. ఆ తర్వాత ఇండియా 12 మ్యాచ్‌‌‌‌లు నెగ్గి 12 డ్రా చేసుకుంది.