వరల్డ్ కప్ 2019: ఇండియాకు ఝలక్​..

వరల్డ్ కప్ 2019: ఇండియాకు ఝలక్​..
  • 31 రన్స్‌‌తో కోహ్లీసేన పరాజయం
  • టోర్నీలో తొలి ఓటమి    
  • సెమీస్‌‌ రేసులో నిలిచిన మోర్గాన్‌సేన 
  • బెయిర్‌‌స్టో సెంచరీ,  ప్లంకెట్‌‌కు మూడు వికెట్లు   
  • రోహిత్‌‌, షమీ పోరాటం వృథా

బెయిర్‌‌ స్టో, బెన్‌‌ స్టోక్స్‌‌ బ్యాట్‌‌ పవర్‌‌ ముందు రోహిత్‌‌, కోహ్లీ, పాండ్యా శక్తి సరిపోలేదు. ప్లంకెట్‌‌, వోక్స్‌‌ పేస్‌‌ ముందు ఐదు వికెట్లు తీసిన షమీ స్పీడ్‌‌ చాల్లేదు. వరుస విజయాలు విసుగుతెచ్చాయో లేక పాక్‌‌కు చాన్స్‌‌ ఇవ్వడం ఎందుకని అనుకుందో గానీ భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో టీమిండియా చప్పగా ఆడింది. ఇంగ్లిష్‌‌ పేసర్ల దెబ్బకు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఆ తర్వాత పరుగులు చేయలేక టోర్నీలో తొలిసారి ఓడింది. బెయిర్‌‌స్టో సెంచరీ, రూట్‌‌, బెన్‌‌స్టోక్స్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌కు తోడు కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో కీలక మ్యాచ్‌‌లో గెలిచిన మోర్గాన్​సేన సెమీస్‌‌ రేసులో నిలిచి ఊపిరి పీల్చుకుంది.  పాకిస్థాన్​ సెమీస్‌‌ అవకాశాలను బాగా తగ్గించింది.

బర్మింగ్‌‌హమ్‌‌: వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.​  చావోరేవో లాంటి మ్యాచ్‌‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్‌‌..  కోహ్లీ సేనను ఓడించి టోర్నీలో ఐదో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో మోర్గాన్‌‌సేన 31 రన్స్‌‌ తేడాతో గెలిచింది. జానీ బెయిర్‌‌ స్టో (109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 111) ధనాధన్‌‌ సెంచరీకి జేసన్‌‌ రాయ్‌‌ (57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 66), బెన్‌‌ స్టోక్స్‌‌(54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) మెరుపు హాఫ్‌‌ సెంచరీలు తోడవడంతో టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బౌలర్లలో మహ్మద్‌‌ షమీ(5/69) ఐదు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో 50 ఓవర్లు ఆడిన ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే  చేసి ఓడిపోయింది. రోహిత్‌‌శర్మ (109 బంతుల్లో 15 ఫోర్లతో 102) సెంచరీ చేయగా, విరాట్‌‌ కోహ్లీ( 76 బంతుల్లో 7ఫోర్లతో 66), హార్దిక్‌‌పాండ్యా (33 బంతుల్లో 4 ఫోర్లతో 45) పోరాడినా ఫలితం లేకపోయింది. ప్లంకెట్‌‌(3/55), క్రిస్‌‌ వోక్స్‌‌ (2/58) ఇండియాను దెబ్బకొట్టారు.  బెయిర్‌‌స్టోకు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

బాదలేకపోయారు..

రోహిత్‌‌ సెంచరీ, కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌‌తో 29 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. చాలా సమయం పాటు వేగంగా ఆడలేకపోవడం ఇండియాను దెబ్బతీసింది. భారీ ఛేజింగ్‌‌లో ఆరంభంలోనే కోహ్లీసేనకు షాక్‌‌ తగిలింది. ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌(0) క్రిస్​ వోక్స్​కు రిటర్న్​ క్యాచ్​ ఇచ్చి డకౌటయ్యాడు. ఇన్నింగ్స్‌‌ రెండో ఓవర్లో  రోహిత్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను ఫస్ట్‌‌ స్లిప్‌‌లో రూట్‌‌ వదిలేశాడు. దీంతో ప్రారంభంలోనే ఇండియా ఒత్తిడిలో పడింది. కోహ్లీ, రోహిత్‌‌ ఒక్కో పరుగు జోడిస్తూ నెమ్మదిగా ఆడారు.  దీంతో తొలి పవర్‌‌ ప్లేలో 28 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. 22 ఓవర్లకు కానీ స్కోరు వంద మార్కు చేరలేకపోయింది. ఆ తర్వాత దూకుడు పెంచిన రోహిత్‌‌..బెన్‌‌ స్టోక్స్‌‌ వేసిన 26వ ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌‌కు ఊపు తెచ్చాడు. అయితే 29వ ఓవర్‌‌లో లెంగ్త్​ బాల్​తో కోహ్లీని ఔట్​ చేసిన  ప్లంకెట్‌‌ ఈ జోడీని విడదీశాడు. దీంతో 138 పరుగుల కీలక పార్ట్​నర్​షిప్​కు తెరపడింది. ఈ దశలో  రోహిత్‌‌కు రిషబ్‌‌ పంత్‌‌(32) జతకలిశాడు. దూకుడు కొనసాగించిన రోహిత్‌‌.. వుడ్‌‌ వేసిన 32వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టి అదే ఊపులో సెంచరీ పూర్తి చేశాడు. 35 ఓవర్లకు 188/2 స్కోరుతో ఇండియా  మెరుగైన స్థితిలోనే కనిపించింది. వుడ్‌‌ వేసిన 36వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన పంత్‌‌ ఛేజింగ్‌‌కు ఊపు తెచ్చాడు. కానీ తర్వాతి ఓవర్లోనే రోహిత్‌‌ కీపర్‌‌ బట్లర్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో మ్యాచ్‌‌ మలుపు తిరిగింది. సాధించాల్సిన రన్‌‌రేట్‌‌ భారీగా పెరిగిన టైమ్‌‌లో  హార్దిక్‌‌ పాండ్యా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. వోక్స్‌‌ వేసిన 39వ ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ బౌండరీలు కొట్టాడు. కానీ,  ధాటిగా ఆడుతున్న పంత్‌‌ను ఔట్‌‌ చేసిన ప్లంకెట్‌‌ మరో దెబ్బకొట్టాడు. పాండ్యా, ధోనీ(42 నాటౌట్‌‌)  క్రీజులో ఉండడంతో ఫ్యాన్స్‌‌ ఆశలు కోల్పోలేదు. కానీ, మహీ బ్యాట్‌‌ ఝుళిపించలేకపోయాడు. 44వ ఓవర్‌‌లో ఆర్చర్‌‌ ఐదు పరుగులే ఇవ్వగా, 45వ ఓవర్‌‌ వేసిన ప్లంకెట్‌‌.. పాండ్యా వికెట్‌‌ తీయడంతో మ్యాచ్‌‌  ఇంగ్లండ్‌‌ చేతుల్లోకి వెళ్లింది. చివరి 30 బంతుల్లో విజయానికి 71 రన్స్‌‌ అవసరం అవగా.. కేదార్‌‌ జాదవ్‌‌ (12 నాటౌట్‌‌) పరుగుల కోసం ఇబ్బంది పడడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

జానీ సూపర్‌‌ సెంచరీ

గత రెండు మ్యాచ్‌‌ల్లో  బ్యాటింగ్‌‌ వైఫల్యంతో  ఓడిన ఇంగ్లండ్‌‌ కీలక పోరులో మాత్రం చేలరేగి ఆడింది. ముఖ్యంగా  ఓపెనర్లు బెయిర్‌‌స్టో, రాయ్‌‌  తొలి వికెట్‌‌కు 133 బంతుల్లోనే  160 రన్స్‌‌ జోడించి పునాది వేశారు. ఆరంభంలో  బుమ్రా, షమీ పదునైన బంతులు వేయడంతో  ఫస్ట్‌‌ పవర్‌‌ ప్లేలో 47 రన్స్‌‌ చేసిన ఇంగ్లండ్‌‌ ఓపెనర్లు తర్వాతి10 ఓవర్లలో రెచ్చిపోయారు. పాండ్యా, కుల్దీప్‌‌, చహల్‌‌ బౌలింగ్‌‌లో బౌండరీలు, సిక్సర్లు కొట్టి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 20 ఓవర్లకు ఇంగ్లండ్‌‌ 145/0 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లిద్దరూ హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు.  ఎట్టకేలకు 23వ ఓవర్‌‌లో కుల్దీప్‌‌ ఇండియాకు బ్రేక్‌‌ ఇచ్చాడు. అతని బౌలింగ్‌‌లో సబ్‌‌స్టిట్యూట్‌‌ ఫీల్డర్‌‌ జడేజా పట్టిన కళ్లు చెదిరే  క్యాచ్‌‌కు రాయ్‌‌ వెనుదిరిగాడు. కానీ, స్పీడ్‌‌ కొనసాగించిన జానీ 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

మలుపు తిప్పిన షమీ, ఆఖర్లో స్టోక్స్‌‌ మోత

వికెట్‌‌ బ్రేక్‌‌ను సద్వినియోగం చేసుకునేందుకు షమీని రంగంలోకి దింపిన కోహ్లీ ఫలితం రాబట్టాడు. సెంచరీ హీరో బెయిర్‌‌ స్టోతోపాటు కెప్టెన్‌‌ మోర్గాన్‌‌(1)ను షమీ వరుస ఓవర్లలో ఔట్‌‌ చేశాడు. రూట్‌‌(44) స్టోక్స్‌‌  నెమ్మదిగా ఆడడంతో రన్‌‌రేట్‌‌ క్రమంగా తగ్గిపోయింది. 28 నుంచి 38 ఓవర్ల మధ్యలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో ఇంగ్లండ్‌‌ 300 చేయడం కష్టమే అనిపించింది. కానీ, చహల్‌‌ బౌలింగ్‌‌లో  స్టోక్స్‌‌ 4, 6తో మళ్లీ వేగం పెంచాడు. 45వ ఓవర్లో రూట్‌‌ను షమీ ఔట్‌‌ చేసినా.. వెనక్కుతగ్గని స్టోక్స్‌‌ 38 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ బౌలింగ్‌‌లో ఎదురుదాడికి దిగాడు. 47వ ఓవర్‌‌లో 17 రన్స్‌‌ ఇచ్చిన షమీ..  బట్లర్‌‌ (20)ను ఔట్‌‌ చేశాడు.  49వ ఓవర్‌‌లో క్రిస్‌‌ వోక్స్‌‌(7)ను పెవిలియన్‌‌ చేర్చిన షమీ ఐదో వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నా.. ఆ ఓవర్లో  స్టోక్స్‌‌ వరుసగా 4, 6, 4 బాదేశాడు. ఆఖరి ఓవర్లో స్టోక్స్‌‌ వికెట్‌‌ తీసిన బుమ్రా  మూడు రన్స్‌‌ మాత్రమే ఇచ్చాడు.

ఆ రివ్యూ కోరి ఉంటే..

ఈ మ్యాచ్‌‌లో డీఆర్‌‌ఎస్‌‌ను ఉపయోగించుకోవడంలో వైఫల్యం ఇండియా  కొంపముంచింది. ముఖ్యంగా రివ్యూలను కచ్చితంగా అంచనా వేసే కీపర్‌‌ ధోనీ ఈ సారి లెక్క తప్పాడు. 11వ ఓవర్లో హార్దిక్‌‌ వేసిన  ఐదో బాల్‌‌ ఇంగ్లండ్‌‌ ఓపెనర్‌‌ జేసన్‌‌ రాయ్‌‌  కుడి చేతి గ్లోవ్‌‌ను తాకుతూ కీపర్‌‌ చేతిలో పడింది. వెంటనే హార్దిక్‌‌, ధోనీ క్యాచ్‌‌ కోసం అప్పీల్‌‌ చేసినా అంపైర్‌‌ అలీందార్‌‌  దాన్ని వైడ్‌‌గా ప్రకటించాడు. అది క్యాచ్‌‌ అని పాండ్యా, తాను భావించినా.. కీపర్‌‌ ధోనీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కోహ్లీ డీఆర్‌‌ఎస్‌‌ తీసుకోలేదు. అప్పటికి టీమ్‌‌ స్కోరు 49 కాగా.. రాయ్‌‌ 21 రన్స్‌‌తో ఉన్నాడు. ఒకవేళ కోహ్లీ రివ్యూ కోరిఉంటే రాయ్‌‌  ఔటయ్యేవాడు. ఆరంభంలోనే వికెట్‌‌ పడితే ఇంగ్లండ్‌‌ కచ్చితంగా ఒత్తిడిలో పడి ఉండేది. ఇండియా ఓటమికి ఇది కూడా ఓ కారణమే.

జడేజా స్టన్నింగ్‌‌ క్యాచ్‌‌

రవీంద్ర జడేజా తన మెరుపు ఫీల్డింగ్‌‌ మరోసారి అందరినీ ఆశ్చర్య పరిచాడు.  లోకేశ్‌‌ రాహుల్‌‌ ప్లేస్‌‌లో సబ్‌‌స్టిట్యూట్‌‌ ఫీల్డర్‌‌గా మైదానంలోకి వచ్చిన జడ్డూ  టోర్నీకే హైలైట్‌‌ అనదగ్గ స్టన్నింగ్‌‌ క్యాచ్‌‌ పట్టి జేసన్‌‌ రాయ్‌‌ను ఔట్‌‌ చేశాడు. కుల్దీప్‌‌ వేసిన 23వ ఓవర్లో క్రీజు ముందుకొచ్చిన రాయ్‌‌ లాంగాన్‌‌ మీదుగా భారీ షాట్‌‌ ఆడాడు. బంతి ఒక బౌన్స్‌‌తో బౌండ్రీ చేరడం ఖాయం అనిపిస్తుండగా.. జడేజా మెరుపు వేగంతో  ఎడమవైపు నుంచి దూసుకొచ్చాడు. అంతే స్పీడుతో ముందుకు  డైవ్‌‌ చేస్తూ  క్యాచ్‌‌ అందుకొని ఔరా అనిపించాడు. చివర్లో బుమ్రా బౌలింగ్‌‌లో బెన్ స్టోక్స్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌నూ అతను ఒడిసిపట్టుకొని ఫీల్డర్‌‌గా ఫుల్‌‌మార్కులు కొట్టేశాడు.

రాహుల్‌‌కు గాయం!

వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియాను గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మ్యాచ్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌ గాయపడ్డాడు. చహల్‌‌ వేసిన 16వ ఓవర్లో  బెయిర్‌‌ స్టో  లాంగాన్‌‌ మీదుగా కొట్టిన సిక్సర్‌‌ను అందుకునేందుకు బౌండ్రీ రోప్స్‌‌ వద్ద అమాతం పైకి ఎగిరిన రాహుల్‌‌ బ్యాలెన్స్‌‌ కోల్పోయి వెనక్కుపడిపోయాడు. నడుం భాగం నేలకు బలంగా తగలడంతో నొప్పితో బాధపడిన రాహుల్‌‌ మైదానం వీడాడు. ఆ తర్వాత రోహిత్‌‌తో కలిసి ఓపెనర్‌‌గా బ్యాటింగ్‌‌కు వచ్చినప్పటికీ ఇబ్బందిగా కనిపించిన లోకేశ్‌‌ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

స్కోర్‌‌బోర్డ్‌‌

ఇంగ్లండ్‌‌ : రాయ్‌‌ (సి) సబ్‌‌/ జడేజా (బి) కుల్దీప్‌‌ 66, బెయిర్‌‌స్టో (సి) పంత్‌‌ (బి) షమీ 111, రూట్‌‌ (సి) పాండ్యా (బి) షమీ 44, మోర్గాన్‌‌ (సి) జాదవ్‌‌ (బి) షమీ 1, స్టోక్స్‌‌ (సి) సబ్‌‌/ జడేజా (బి) బుమ్రా 79, బట్లర్‌‌ (సి అండ్‌‌ బి) షమీ 20, వోక్స్‌‌ (సి) రోహిత్‌‌ (బి) షమీ 7, ప్లంకెట్‌‌ (నాటౌట్‌‌) 1, ఆర్చర్‌‌ (నాటౌట్‌‌) 0; ఎక్స్‌‌ట్రాలు :8;   మొత్తం  50 ఓవర్లలో 337/7; వికెట్ల పతనం: 1–160, 2–205, 3–207, 4–277, 5–310, 6–319, 7–336; బౌలింగ్‌‌: షమీ 10–1–69–5, బుమ్రా 10–1–44–1, చహల్‌‌ 10–0–88–0, హార్దిక్‌‌ 10–0–60–0, కుల్దీప్‌‌ 10–0–72–1.

ఇండియా: రాహుల్‌‌ (సి అండ్‌‌ బి) వోక్స్‌‌ 0, రోహిత్‌‌ (సి) బట్లర్‌‌ (బి) వోక్స్‌‌ 102, కోహ్లీ (సి)సబ్‌‌/విన్స్‌‌(బి) ప్లంకెట్‌‌ 66, పంత్‌‌(సి) వోక్స్‌‌ (బి) ప్లంకెట్‌‌ 32, పాండ్యా (సి) సబ్‌‌/విన్స్‌‌ (బి) ప్లంకెట్‌‌ 45, ధోనీ (నాటౌట్‌‌) 42, జాదవ్‌‌ (నాటౌట్‌‌) 12; ఎక్స్‌‌ట్రాలు : 7 ; మొత్తం: 50 ఓవర్లలో 306/5; వికెట్ల పతనం: 1–8, 2–146, 3–198, 4–226, 5–267; బౌలింగ్‌‌ : వోక్స్‌‌ 10–3–58–2, ఆర్చర్‌‌ 10–0–45–0, ప్లంకెట్‌‌ 10–0–55–3, వుడ్‌‌ 10–0–73–0, ఆదిల్‌‌ 6–0–40–0, స్టోక్స్‌‌ 4–0–34–0.