IND vs PAK: రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. పాక్‌ను చిత్తుచేసిన భారత్

IND vs PAK: రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. పాక్‌ను చిత్తుచేసిన భారత్

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 20 ఓవర్లు మిగిలివుండగానే చేధించింది. మొదట భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు తేలిపోగా.. లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) వీరవిహారం చేశాడు.

భారత బౌలర్ల జోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌(50) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ హోరాహోరీ తప్పదనుకున్నప్పటికీ.. బాబర్ వెనుదిరిగాక అంతా తలకిందులైంది. 42.5 ఓవర్ల వద్ద పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

రోహిత్ మెరుపులు

స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ వీర విహారం చేశాడు. ఓవర్‌కు రెండేసి చొప్పున బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హిట్ మ్యాన్ ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి పాక్ ఓటమి ఖరారు అయిపోయింది. రోహిత్ (86), శ్రేయాస్ అయ్యర్(53) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీసుకోగా... హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో భారత్(6 పాయింట్లు, +1.821  రన్‌రేట్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.