ఒక్కసారి క్రికెటర్ గా రాణిస్తే చాలు ఇక తిరిగి చూడకుండా సంపాదన. ఇంటర్నేషన్ స్థాయిలో ఆడే క్రికెటర్ల గురిచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. నేషనల్ టీమ్ కు ఆడితే వచ్చే ఆదాయంతో పాటు ఐపీఎల్ వంటి లీగ్ లు, యాడ్స్ , ఇతర ఒప్పందాలతో కోట్లు సంపాదిస్తుంటారు. అయితే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో మాత్రం క్రికెటర్ల పరిస్థితి అంతంతమాత్రమేనని చెప్పాలి. అందుకు ఉదాహరణ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్. డచ్ టీమ్ లో కీలక బౌలర్ గా ఎదిగిన మీకెరెన్.. ప్రస్తుతం ఉపాధి కోసం ఊబర్ ఈట్స్ డెలివరీ బాయ్ గా మారాడు. కొంతకాలంగా మీకెరెన్ నెదర్లాండ్స్ టీమ్ లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 5 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టీ20 ఫార్మాట్లో 47 వికెట్లు తీశాడు. కరోనా కారణంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నెదర్లాండ్స్ క్రికెట్ ప్లేయర్లు మ్యాచ్ లు లేక ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో కుటుంబ పోషణ కోసం మీకెరెన్ డెలివరీ బాయ్ గా చేరక తప్పలేదు.
ఈఎస్పీఎన్ క్రికిన్ఫో సంస్థ చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మీకెరెన్ తన పరిస్థితిని తెలిపాడు. సరిగ్గా ఈ రోజున మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టీ20 పురుషుల వరల్డ్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉంది అని క్రికిన్ఫో పేర్కొనగా, “నిజమే, ఈ సీజన్ లో నేను కూడా క్రికెట్ ఆడాల్సిన వాడిని. కానీ ఊబర్ ఈట్స్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాను” అని మీకెరెన్ రీట్వీట్ చేశాడు. “ఈ శీతాకాలంలో కుటుంబం గడవాలి కదా, పరిస్థితులు ఎలా మారిపోతాయో తలుచుకుంటే తమాషాగా అనిపిస్తోంది. ఉల్లాసంగా గడపండి మిత్రులారా” అంటూ ఈ నెదర్లాండ్స్ బౌలర్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కు నెదర్లాండ్స్ జట్టు కూడా క్వాలిఫై అయింది. ఈ జట్టు గ్రూప్-బిలో ఉంది. అయితే ఈ టోర్నీని ఐసీసీ రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.
Should’ve been playing cricket today ?? now I’m delivering Uber eats to get through the winter months!! Funny how things change hahaha keep smiling people ? https://t.co/kwVEIo6We9
— Paul van Meekeren (@paulvanmeekeren) November 15, 2020
