రొనాల్డో మాటతో కోకాకోలాకు 29 వేల కోట్ల నష్టం 

రొనాల్డో మాటతో కోకాకోలాకు 29 వేల కోట్ల నష్టం 

స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారుండరు. మైదానంలో పాదరసంలా కదులుతూ, డ్రిబ్లింగ్ టెక్నిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంలో రొనాల్డోది అందెవేసిన చేయి. ఆటలో అతనికి అందని రికార్డులు చాలా అరుదు. రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. అతడి బ్రాండింగ్ వ్యాల్యూ కూడా ఎక్కువే. అందుకే అతడి ఒక్క మాటతో ప్రముఖ కూల్‌డ్రింక్ కంపెనీ కోకాకోలాకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇంతకీ కోకాకోలా గురించి రొనాల్డో ఏమన్నాడోననేగా మీ సందేహం. వివరాలు.. నిన్న యూఈఎఫ్‌ఏ యూరో 2020 మ్యాచ్‌కు ముందుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమానికి పోర్చుగీస్ కెప్టెన్ రొనాల్డోతోపాటు టీమ్ మేనేజర్ ఫెర్నాండో శాంటోస్ పాల్గొన్నారు. 

ప్రెస్ మీట్ ఏర్పాట్లలో భాగంగా టోర్నమెంట్ స్పాన్సర్‌‌లలో ఒకటైన కోకాకోలాకు చెందిన రెండు కూల్‌డ్రింక్ బాటిళ్లను రొనాల్డో ఎదురుగా ఉంచారు. అయితే రొనాల్డో ఆ బాటిళ్లను అక్కడి నుంచి తీసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న నీళ్ల సీసాలను తీసుకొని మంచి నీళ్లు తాగండి అని పోర్చుగీస్‌లో వ్యాఖ్యానించాడు. రొనాల్డో మామూలుగానే ఈ కామెంట్ చేసినా అది కోకాకోలా షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దెబ్బకు కోకాకోలా షేర్ ధర 56.10 డాలర్లుగా ఉన్నది కాస్తా 55.22 డాలర్లకు పడిపోయింది. సుమారుగా 1.6 శాతం షేర్ ధర పడిపోయింది. అంటే దాదాపు రూ.29 వేల కోట్ల రూపాయ విలువైన సంపద ఆవిరైపోయిందన్నమాట. దీనిపై కోకాకోలా స్పందిస్తూ.. ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. కాగా, 2006లో ఓ కోకాకోలా యాడ్‌లో రొనాల్డో కనిపించాడు. అందుకోసం అప్పట్లో అతడికి భారీ మొత్తమే మూటజెప్పారని తెలిసింది.