విమర్శలు పట్టించుకోను.. ఒలింపిక్‌‌ మెడలే లక్ష్యం

విమర్శలు పట్టించుకోను.. ఒలింపిక్‌‌ మెడలే లక్ష్యం

సుశీల్‌‌ కుమార్‌‌.. రెండు ఒలింపిక్‌‌ మెడల్స్‌‌ సాధించిన ఏకైక ఇండియన్‌‌.  ఈ ఘనతను సమం చేసే అరుదైన చాన్స్‌‌..  మహిళల బ్యాడ్మింటన్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌  పీవీ సింధు ముందు ఇప్పుడుంది. రియోలో సిల్వర్‌‌ సాధించిన తెలుగమ్మాయి ఈ ఏడాది టోక్యోలో గోల్డ్‌‌ గెలవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. గతేడాది వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచినా.. మిగిలిన టోర్నీల్లో నిరాశపరిచిన ఈ స్టార్‌‌ ప్లేయర్‌‌ 2020లో తన సత్తా చూపిస్తానంటోంది. తప్పులు, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటానని, గెలుపోటములతో సంబంధం లేకుండా పాజిటివ్‌‌గా ఉంటానని చెబుతోంది. కొత్త ఏడాదిలో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె మాటల్లోనే..

అన్నీ గెలవడం సాధ్యం కాదు..

వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ గెలవడం చాలా సంతోషాన్నిచ్చింది. కానీ ఆ తర్వాత బరిలోకి దిగిన టోర్నీల్లో ఫస్ట్‌‌ రౌండ్‌‌ దాటలేకపోయా. అయినా పాజిటివ్‌‌గానే ఉన్నా. ప్రతీ మ్యాచ్‌‌ గెలవడం ఎవరి వల్లా కాదు. కొన్నిసార్లు చాలా తెలివిగా ఆడతాం. ఇంకొన్నిసార్లు చాలా తప్పులు చేస్తాం. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఉంటా. కోర్ట్‌‌లోకి బలమైన ప్రత్యర్థిగా తిరిగి రావాలంటే పాజిటివ్‌‌గా ఉండడం చాలా అవసరం. నేను ప్రతీ మ్యాచ్‌‌ గెలవాలని ఆశిస్తారని తెలుసు. నా మీద ఎన్ని అంచనాలు ఉంటాయో కూడా తెలుసు. అయితే ఆ ఒత్తిడితోపాటు, సరిగ్గా ఆడనప్పుడు ఎదురయ్యే విమర్శలను పట్టించుకోను.

ఒలింపిక్‌‌ మెడలే లక్ష్యం

నాతోపాటు ఏ అథ్లెట్‌‌కైనా ఒలింపిక్‌‌ మెడలే అంతిమ లక్ష్యం.  ఇందుకోసం నా టెక్నిక్‌‌, స్కిల్‌‌ను మెరుగుపర్చుకోవడానికి కఠోర సాధన చేస్తున్నా. అన్నీ ప్లాన్‌‌ ప్రకారం జరిగితే ఒలింపిక్‌‌ సీజన్‌‌ సాఫీగా ముగుస్తుంది. రెండు ఒలింపిక్‌‌ మెడల్స్‌‌ గెలిచిన రెజ్లర్‌‌ సుశీల్‌‌ కుమార్‌‌ దేశానికే గర్వకారణంగా నిలిచాడు. టోక్యోలో మెడల్‌‌ గెలిచి నేను ఆ స్థాయికి చేరాలని ఆశిస్తున్నా. నా మైండ్‌‌లో కూడా ఎప్పుడూ అదే ఉంటుంది. నేనెప్పుడూ ఒక్కో మెట్టు ఎక్కాలని అనుకుంటా. అయితే ఈసారి మెడల్‌‌ గెలవడం అంత సులువు కాదు. మలేషియా, ఇండోనేసియా ఓపెన్‌‌లతో సీజన్‌‌ మొదలవుతుంది. అక్కడి నుంచి ఒలింపిక్‌‌ క్వాలిఫికేషన్‌‌ వరకు ఆడే ప్రతీ టోర్నీ, ప్రతీ మ్యాచ్‌‌ నాకు కీలకమే.

పీబీఎల్‌‌ కోసం ఎదురుచూస్తున్నా..

ప్రీమియర్‌‌ బ్యాడ్మింటన్‌‌ లీగ్‌‌ (పీబీఎల్‌‌) కోసం ఎదురుచూస్తున్నా. ఈ నెలలోనే లీగ్‌‌ ఉండడంతో జట్లన్నీ బలంగానే ఉంటాయి. ఫలానా టీమ్‌‌ బలంగా ఉందని కచ్చితంగా చెప్పలేం. అందువల్ల ప్రతీ మ్యాచ్‌‌కు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఒలింపిక్స్‌‌ సన్నాహకాల్లో భాగంగా శ్రీకాంత్‌‌, సైనా నెహ్వాల్‌‌ ఈసారి లీగ్‌‌కు దూరంగా ఉంటున్నారు. కానీ నా వరకు ఇవి కొన్ని అదనపు  మ్యాచ్‌‌లు మాత్రమే. లీగ్‌‌ స్వదేశంలో జరుగుతుంది. పెద్ద సంఖ్యలో సొంత అభిమానుల మధ్య ఆడడాన్ని ఎంజాయ్‌‌ చేయాలనుకుంటున్నా. ఫేవరెట్‌‌ ప్లేయర్స్‌‌ ఆటను నేరుగా చూస్తే ఫ్యాన్స్‌‌ కూడా సంతోషిస్తారు. పైగా లీగ్‌‌ ఏడాదికోసారి మాత్రమే జరుగుతుంది. లీగ్‌‌ వల్ల టాప్‌‌ ప్లేయర్స్‌‌ నుంచి యంగ్‌‌స్టర్స్‌‌ చాలా నేర్చుకుంటున్నారు. పీబీఎల్‌‌ యంగ్‌‌స్టర్స్‌‌కు దొరికిన ఓ గొప్ప అవకాశం.