ఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్

ఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్
  • ఏదులాపురం నేతలు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి మీటింగ్
  • జనవరి 7న ఖమ్మం వస్తున్న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఖమ్మం, వెలుగు: పంచాయతీ ఎన్నికల సందడి ముగియడంతో ఇక మున్సిపల్ ఎన్నికలపై అందరూ నజర్​ పెట్టారు. మున్సిపాలిటీల్లో ఎలక్షన్లకు సంబంధించిన కసరత్తును అధికారులు మొదలుపెట్టారు. తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్​ జారీ చేయడంతో, పొలిటికల్ పార్టీల నేతలు కూడా అలర్టయ్యారు. 

ప్రధానంగా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ముఖ్య నేతలు ఎలక్షన్లకు సంబంధించి ముఖ్య నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్​ పార్టీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ  స్థానాలను గెల్చుకున్న ఉత్సాహంతో అదే తరహాలో మున్సిపాలిటీలను కూడా గెల్చుకునేలా ప్రణాళికలను రచిస్తోంది. బీఆర్ఎస్​ నేతలు కూడా కొత్త ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

అభివృద్ధి పనులు.. సన్నాహక సమావేశాలు.. 

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ పాలకవర్గానికి వచ్చే ఏప్రిల్ నెలాఖరు వరకు సమయం ఉండడంతో దీనికి సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణపై నోటిఫికేషన్​ రాలేదు. పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడగా, వైరా నియోజకవర్గంలో వైరా, మధిర నియోజకవర్గంలో మధిర, సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మున్సిపాలిటీలుగా ఉండగా, కల్లూరు కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వీటిలో తన నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి ఫుల్ ఫోకస్​ పెట్టారు. 

మంగళవారం ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎలక్షన్లకు సమాయత్తం చేశారు. నాలుగు రోజుల కింద మున్సిపాలిటీ పరిధిలో రూ.45 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మండల్​ఆఫీసర్స్​ కాంప్లెక్స్​ కు పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఆ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు సహా రూ.221 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. 

బీఆర్ఎస్​ ప్రయత్నాలు షురూ..

మరోవైపు బీఆర్​ఎస్​ కూడా మున్సిపోల్స్​ కు సిద్ధమవుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో 566 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్​ పార్టీ మద్దతుదారులు 407 సర్పంచ్​ స్థానాలను, బీఆర్ఎస్ సపోర్టర్లు​ 124 సర్పంచ్​ లను గెల్చుకున్నారు. పార్లమెంట్​ ఎన్నికల నాటికంటే ఓట్ల శాతం పెరిగిందంటూ బీఆర్ఎస్​ నేతలు చెబుతున్నారు. జిల్లాలో గెలిచిన సర్పంచ్​ లను సన్మానించేందుకు జనవరి 7న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఖమ్మం రాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించనున్నారు. 

ఎక్కడ.. ఎంత మంది ఓటర్లు.. 

ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, 38,210 మంది జనాభా ఉన్నారు. సత్తుపల్లిలోని 23 వార్డుల్లో 31,857 మంది జనాభా ఉండగా, వైరాలో 20 వార్డుల్లో 31,056 మంది, మధిరలో 22 వార్డుల్లో 30,856 మంది జనాభా, కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 22,748 మంది జనాభా ఉన్నారు. 

జనవరి 10వ తేదీలోపు మున్సిపాలిటీల్లో అన్ని వార్డులకు పోలింగ్ కేంద్రాల వారీగా ఫైనల్​ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ముందుగా ముసాయిదా ఓటర్ జాబితాపై జనవరి 1 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5న పట్టణ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 10న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

కొత్తగూడెం కార్పొరేషన్​తోపాటు మున్సిపాలిటీల్లో.. 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో భాగంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. సుజాతనగర్​ మండలంలోని ఏడు పంచాయతీలతో పాటు పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్​లో ఇటీవలీ కాలంలో విలీనం అయ్యాయి. 

కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో 60 డివిజన్లున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేటలో 22వార్డులు, మణుగూరులో 20వార్డులున్నాయి. కొత్తగూడెం కార్పోరేషన్ల డివిజన్లతో పాటు ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆఫీసర్లు తయారు చేయనున్నారు. 2025 అక్టోబర్​ ఒకటో తేదీ నాటి వరకు గల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన ఓటర్ల జాబితా ప్రకారంగా వార్డుల వారీగా కొత్తగా ఓటర్ల జాబితాను రెడీ చేస్తున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

కాగా, గ్రామపంచాయతీగా ఉన్న అశ్వారావుపేట ఈ ఏడాది జనవరిలో కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన అశ్వారావుపేట ప్రజలు త్వరలో జరుగనున్న మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయనున్నారు. ఇదిలా ఉండగా గ్రామపంచాయతీగా ఉన్న మణుగూరు 2005 లో మున్సిపాలిటీగా ఏర్పడింది.

మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంపై పలువురు గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. గిరిజన చట్టాలు అమలవుతున్న మణుగూరును మున్సిపాలిటీగా మార్చడంపై పలువురు కేసులు వేయడంతో ఇప్పటి వరకు ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు లేవు. హైకోర్టులో కేసు నడుస్తుండడంతో త్వరలో జరగబోయే మున్సిపల్​ ఎన్నికల్లోనైనా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగుతాయా అని పట్టణ వాసుల్లో జోరుగా అన్న చర్చ  జరుగుతోంది. 

కటౌట్లు కాదు.. కంటెంట్ ఉన్నోడికి పార్టీ బీఫారం ..ఏదులాపురం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి 

ఖమ్మం రూరల్, వెలుగు: కటౌట్లు కాకుండా కంటెంట్ ఉన్న వాళ్లకు పార్టీ బీఫారం ఇచ్చి గెలిపిస్తుందని, ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేసి ఏదులపురం మున్సిపాలిటీలో 32 డివిజన్లకు 32 డివిజన్లు గెలిపించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

 ఖమ్మం నగరంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన ఏదులాపురం మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంత పెద్ద నాయకుడైనా,  గల్లీ లీడర్ అయినా చేసిన పనులు ప్రజలకు చెప్పుకోకపోతే ఉపయోగం ఉండదని, చెప్పి వాటిని ఓట్లుగా మలుచుకోవాలని సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.221 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.