న్యూఢిల్లీ: వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంకా గాంధీ, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా పెండ్లి పీటలు ఎక్కనున్నారు. 25 ఏండ్ల రేహాన్ తన స్నేహితురాలు అవివా బేగ్‌ను పెండ్లి చేసుకోనున్నట్టు తెలిసింది. రేహాన్ సోమవారం ప్రపోజ్ చేయగా.. అవివా అంగీకరించిందని, వారి పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలిసింది.
కాగా, బుధవారం రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో వారి ఎంగేజ్మెంట్మరింత వైభవంగా జరగవచ్చని తెలుస్తోంది. అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త. తల్లి నందితా బేగ్ ఇంటీరియర్ డిజైనర్. ప్రియాంక, నందితా బేగ్ పాత స్నేహితులని తెలిసింది. రేహాన్ వాద్రా.. రాజీవ్ గాంధీ, రాహుల్ చదువుకున్న డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో చదువుకున్నారు.
ఆ తర్వాత లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టాపొందారు. రేహాన్ ఒక విజువల్ ఆర్టిస్ట్. ఫొటోగ్రఫీ అతని చిన్ననాటి అభిరుచి. దీనిని అతని తల్లి ప్రియాంక ప్రోత్సహించారు. అతని తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అవివా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడరన్ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పొందారు.
రణతంబోర్‌లో గాంధీ- వాద్రా,బేగ్ కుటుంబాలు
రాహుల్ గాంధీతో సహా గాంధీ కుటుంబ సభ్యులు మంగళవారం రణతంబోర్‌కు చేరుకున్నారు. వారితో పాటు వాద్రా, బేగ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు సమాచారం. వారు అక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో పాటు ప్రసిద్ధ వన్యప్రాణుల పార్కును సందర్శించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
