న్యూఢిల్లీ, వెలుగు: విలువైన కోర్టు సమయాన్ని ఆదా చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యాయవ్యవస్థలో మరో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అత్యవసర మెన్షన్లపై నిర్ణయం తీసుకున్న ఆయన సుదీర్ఘ వాదలనకు చెక్ పెడుతూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. కేసుల విచారణ తీరును సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు తాజాగా సర్క్యూలర్ జారీ చేసింది.
దీని ప్రకారం.. సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్(ఏవోఆర్) తమ వాదనలకు ఎంత సమయం కావాలో విచారణకు ఒకరోజు ముందే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కోర్టుకు తెలియజేయాలని స్పష్టం చేసింది. వాదనలకు మూడ్రోజుల ముందే తమ వాదనల సారాంశాన్ని రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. డెడ్లైన్ తప్పనిసరిగా పాటించాలని, కోర్టు కేటాయించిన సమయం ముగియగానే వాదనలను ముగించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
