- దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు..
- నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా (80) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మూడుసార్లు దేశ ప్రధానిగా, బీఎన్‌పీ చైర్‌పర్సన్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అగ్రనేత ఖలీదా జియా (80) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో నెల రోజులుగా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
గత కొన్నేండ్లుగా లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బీపీ, షుగర్‌తో ఖలీదా బాధపడుతున్నారు. నవంబర్ 23న ఆస్పత్రిలో అడ్మిట్ అయిన ఆమె.. అప్పటి నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే ఖలీదా కుమారుడు తారీక్ రెహమాన్, ఇతర కుటుంబసభ్యులు, పార్టీ నేతలు హాస్పిటల్‌కు చేరుకున్నారు.
ప్రముఖుల సంతాపం..
ఖలీదా జియా మృతి విషయం తెలిసిన వెంటనే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. అధికారిక లాంఛనాలతో బుధవారం ఖలీదా అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు యూనస్ వెల్లడించారు. మొత్తం మూడ్రోజులు సంతాప దినాలు, అంత్యక్రియల రోజు సెలవు ప్రకటించారు.
‘‘మనం గొప్ప నాయకురాలిని, రాజనీతిజ్ఞత కలిగిన నేతను, దేశ సంరక్షకురాలిని కోల్పోయాం. బంగ్లాదేశ్ చరిత్రలో ఖలీదా జియాది ముఖ్యమైన చాప్టర్” అని యూనస్ పేర్కొన్నారు. జియా ఖలీదా మృతిపై బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు.
‘‘బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఖలీదా జియాది ముఖ్యమైన అధ్యాయం. దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ప్రజాస్వామ్య స్థాపనకు ఎంతో కృషి చేశారు. ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి” అని షేక్ హసీనా పేర్కొన్నారు. కాగా, ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు.
అలా పొలిటికల్ ఎంట్రీ..
ఖలీదా జియా.. బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. మూడుసార్లు దేశ ప్రధానిగా, బీఎన్‌పీ చైర్‌పర్సన్‌గా సుదీర్ఘ కాలం సేవలందించారు. బీఎన్‌పీ చీఫ్, తన భర్త జియావుర్ రెహమాన్.. దేశ అధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో(1981) సైనిక తిరుగుబాటు కారణంగా హత్యకు గురయ్యారు.
దీంతో 35 ఏండ్ల వయసులో 1982లో ఖలీదా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1984లో బీఎన్‌పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ పాలనపై అలుపెరుగని పోరాటం చేశారు. సైనిక పాలనకు ముగింపు పలికి, 1991 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. దేశంలో పార్లమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు.
