మున్సిపల్​ స్టాఫ్​తో ఫ్లెక్సీలు కట్టించిన్రు

మున్సిపల్​ స్టాఫ్​తో ఫ్లెక్సీలు కట్టించిన్రు

బెల్లంపల్లిలో టీఆర్ఎస్​ లీడర్ల తీరుపై విమర్శలు


బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్​లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల శుభాకాంక్షలు తెలిపే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలను బెల్లంపల్లి మునిసిపల్ సిబ్బంది పలు కూడళ్లలో, ప్రధాన రహదారి డివైడర్​పై కట్టారు. మున్సిపల్ పాలకవర్గం ఆదేశాలతో బుధవారం ఉదయం  5 గంటల నుంచే మున్సిపల్ సిబ్బంది ట్రాలీలో ఫ్లెక్సీలను వేసుకొని టౌన్​లోని  ఏఎంసీ నంబర్ 2 క్రీడా మైదానం మెయిన్​రోడ్డు నుంచి మెయిన్ బజార్, కాంటా చౌరస్తా, పాత బస్టాండ్, కన్నాల ఫ్లైఓవర్ వరకు ఫ్లెక్సీలు కట్టారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు, ఇతర పనులు చేయాల్సిన సిబ్బందితో ఫ్లెక్సీలు కట్టించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ పెద్దలు మున్సిపల్​పనులు చేయనీయకుండా కార్యకర్తల్లా సిబ్బందిని వాడుకుంటున్నారని పలువురు మండిపడ్డారు. 


సిబ్బందిని మందలించాం
ఫ్లెక్సీలు కట్టిన విషయమై మున్సిపల్​ సిబ్బందిని మందలించాం. ఫ్లెక్సీలు కట్టిన విషయం నాకు తెలియదు. విషయం తెలియ గానే సిబ్బందితో మాట్లాడాను. మరోసారి ఇలాంటివి చేయకూడదని హెచ్చరించి, ఇతర పనులకు సిబ్బందిని పంపించాను. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఎవరూ అనుమతులు తీసుకోలేదు.                                                             ‑ జంపాల రజిత, బెల్లంపల్లి మున్సిపల్​ కమిషనర్​