హైదరాబాద్, వెలుగు: రైతు కళ్లల్లో ఆనందాన్ని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌నేత హరీశ్‌రావు ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టించడానికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదని హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని.. లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని గోదారి పాలు చేసిన పాపం కేసీఆర్, హరీశ్ ది కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఆ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే హరీశ్సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్టోబర్ 23న మేడిగడ్డ కుంగిపోయిందని, కుంగిన ప్రాజెక్టు గురించి హరీశ్, కేటీఆర్ ఏనాడు మాట్లాడలేదని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే చవకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పై ఎన్ని విమర్శలు చేసినా అతన్ని కేసీఆర్ నమ్మడని.. రేపో, మాపో హరీశ్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్ఎస్ నేతలని, సీఎం రేవంత్ పాలన చూసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.
కేసీఆర్ అసమర్థత వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని, అసెంబ్లీ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని ఆయన అన్నారు. ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కు పోయే అర్హత కేటీఆర్ కు లేదని, గవర్నర్ ను గౌరవించుకునే సంప్రదాయం బీఆర్ఎస్ కు తెలియదన్నారు. మేడిగడ్డ పునరుద్ధరణపై తమ ప్రభుత్వం ఢిల్లీలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజల తిరస్కారాన్ని బీఆర్ఎస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
