యాసంగి రికార్డు..73 లక్షల ఎకరాల్లో పంటల సాగు

యాసంగి రికార్డు..73 లక్షల ఎకరాల్లో పంటల సాగు
  • అత్యధికంగా వరి సాగు.. 57.42 లక్షల ఎకరాల్లో నాట్లు
  • 6.47 లక్షల ఎకరాల్లో మక్కలు.. సాగులో నల్గొండ టాప్
  • సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక


హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగి సాగు భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 73.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2020-–21లో నమోదైన 68.17 లక్షల ఎకరాల సాగు రికార్డును రైతులు బ్రేక్ చేశారు. వరి నాట్లలోనూ 57.42 లక్షల ఎకరాలతో ఆల్‌‌టైం రికార్డు నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో యాసంగి పంటలు ఎక్కువగా సాగయ్యాయి. వరితో పాటు మొక్కజొన్న, పప్పుశనగ, వేరుశనగ పంటలు వేశారు. యాసంగి సాగుపై రాష్ట్ర సర్కారుకు బుధవారం వ్యవసాయ శాఖ నివేదిక అందించింది.

60 లక్షల ఎకరాలు దాటేదే.. కానీ

రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగిలో 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ అంతకుమించి 57.42 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. 2020–21లో వేసిన 52.80 లక్షల ఎకరాలే ఇప్పటిదాకా అత్యధికం. చెరువులు, బావుల్లో నీరు ఉండటంతో వరి సాగు పెరిగింది. నిజానికి వడ్లు కొనబోమని గతంలో సర్కార్ ప్రకటించడంతో చాలా మంది రైతులు వరి వేయలేదు. దీంతో కొంత తగ్గి 35.84 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి ఎలాంటి ఆంక్షలు లేకపోవడం, రైతులందరూ వరికే మొగ్గుచూపడంతో రికార్డు స్థాయిలో సాగైంది. త్రీ ఫేజ్ కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో సాగు కాస్త తగ్గిందని, లేకపోతే 60 లక్షల ఎకరాలు దాటేదని నిపుణులు అంటున్నారు. ఇక రాష్ట్రంలో వరి తర్వాత ఎక్కువగా మక్కలు సాగవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.47 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 4.63 లక్షల ఎకరాలని అధికారులు అంచనా వేయగా.. లక్షన్నర ఎకరాల్లో ఎక్కువగా నమోదైంది. ఖమ్మం, నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, కామారెడ్డి, గద్వాల, జగిత్యాల, నిజామాబాద్‌, కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మక్కలు ఎక్కువగా వేశారు.

టాప్‌లో నల్గొండ

యాసంగి సాగులో అన్ని పంటల్లో 5.80 లక్షల ఎకరాలతో నల్గొండ టాప్​లో నిలిచింది. తర్వాత నిజామాబాద్‌లో 5.08 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 4.79 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 4.13 లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 3.76 లక్షల ఎకరాలు, జగిత్యాలలో 3.42 లక్షల ఎకరాలు, కరీంనగర్‌లో 2.92 లక్షల ఎకరాలు, యాదాద్రిలో 2.91 లక్షల ఎకరాలు, ఖమ్మంలో 3.10 లక్షల ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 3.12 లక్షల ఎకరాలు, నిర్మల్‌లో 2.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి కూడా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇది నిరుడు కంటే లక్షా 22 వేల ఎకరాలు ఎక్కువ. తర్వాత సూర్యాపేటలో 4.76 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్‌లో 4 లక్షల ఎకరాల్లో వేశారు. సిద్దిపేటలో 3.46 లక్షల ఎకరాలు వేయగా.. నిరుడు కంటే దాదాపు లక్ష ఎకరాల్లో సాగు పెరిగింది. జగిత్యాలలో 2.98 లక్షల ఎకరాల్లో వరి వేయగా.. నిరుడు కంటే లక్షా 33 వేల ఎకరాల్లో సాగు పెరిగింది. యాదాద్రిలో 2.90 లక్షల ఎకరాలు వరి వేయగా.. నిరుడు కంటే అత్యధికంగా దాదాపు లక్షన్నర ఎకరాల్లో ఎక్కువగా నమోదైంది.