ఫసల్ బీమా పాత బాకీ  ఇంకా కట్టలే

ఫసల్ బీమా పాత బాకీ  ఇంకా కట్టలే
  • మూడేండ్ల సంది బీమా వాటా కట్టని రాష్ట్ర సర్కార్​
  • పరిహారం ఆపేసిన బీమా కంపెనీలు
  • నిలిచిపోయిన రూ.840.69 కోట్లు


హైదరాబాద్, వెలుగు: పంట నష్టపోయిన రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్​ బీమా పథకం రైతులకు అందట్లేదు. రైతులు, కేంద్రం తమ వాటా చెల్లించినా రాష్ట్ర సర్కారు మాత్రం మూడేండ్లుగా తన వాటాను చెల్లించకపోవడంతో.. రైతులు నష్టపోతున్నారు. కేంద్రం తెచ్చిన ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చేరింది. అందులో భాగంగా రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే.. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, 2018–19, 201–2020కి సంబంధించి రైతులు ప్రీమియం కట్టారు. కానీ, రాష్ట్ర సర్కారు తన వాటాను ఇప్పటిదాకా చెల్లించలేదు. దీంతో బీమా కంపెనీలు రైతులకు నష్టపరిహారాన్ని ఆపేశాయి. దీంతో ఇటు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాక.. తాము చెల్లించిన ప్రీమియానికీ బీమా ధీమా లేక రైతులు నష్టపోయి గోసపడుతున్నారు. దీంతో సోమవారం ఆదిలాబాద్‌‌ రైతులు  హైదరాబాద్‌‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్​ను ముట్టడించిన సంగతి తెలిసిందే.  
 

రైతులు కట్టినా...
రైతులు తమ వాటా కింద బీమా ప్రీమియం చెల్లించినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడేండ్లలో తన వాటా కట్టకపోవడంతో రూ.840.69 కోట్ల పరిహారం రైతులకు అందలేదు. 2018–19లో రెండు సీజన్లకు కలిపి 7.99 లక్షల మంది రైతులు రూ.155.99 కోట్లు ప్రీమియం చెల్లించి ఫసల్​ బీమా, వాతావరణ బీమా చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.389.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, రాష్ట్ర సర్కారు తన వాటా మొత్తం రూ.194.78 కోట్లు కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను చెల్లించలేదు. ఆ ఏడాది పంట నష్టంపై రిపోర్ట్​ చేసిన క్లెయిములు రూ.587.31 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 58 వేల మంది రైతులకు  రూ.148.90 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా రూ.438.41 కోట్లు పరిహారం అందాల్సి ఉంది. 2019–20లో రెండు సీజన్లు కలిపి 10.33 లక్షల మంది రైతులు రూ.239.48 కోట్లు ప్రీమియం చెల్లించారు. ఆ ఏడాది పంట నష్టం క్లెయిములు రూ.402.28 కోట్లు కాగా ఇప్పటి వరకు ఒక్కపైసా అందలేదు. ప్రభుత్వాలు తమ వాటా కింద రూ.641.27 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.320.63 కోట్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో రైతులకు రూ.402.28 కోట్ల పరిహారం అందలేదు. మొత్తంగా రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.515.41 కోట్లు చెల్లించలేదు.  
 

సుప్రీం కోర్టుకు పోయిన సర్కారు 
2020 సెప్టెంబరు, అక్టోబర్​లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. పంట బీమా అమలు చేయక రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. విస్సా కిరణ్​ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగు నెలల్లో రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీని ఇవ్వాల్సిందిగా సర్కారును హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనిపై సర్కారు సుప్రీంకోర్టుకెళ్లింది.