హైదరాబాద్లో కొత్తగా 2 మెడికవర్ హాస్పిటల్స్.. ఇవాళ (సెప్టెంబర్ 16) సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ ప్రారంభం

హైదరాబాద్లో కొత్తగా 2 మెడికవర్ హాస్పిటల్స్.. ఇవాళ (సెప్టెంబర్ 16) సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ ప్రారంభం

వచ్చే ఏడాది ఐపీఓకి వెళ్లే ఆలోచన

హైదరాబాద్, వెలుగు: మెడికవర్‌‌ హాస్పిటల్స్ తెలంగాణలో విస్తరణకు సిద్ధమైంది. సికింద్రాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడితో 300 బెడ్ల సామర్థ్యం గల హాస్పిటల్‌ను ఇప్పటికే  నిర్మించింది.  దీనిని  సెప్టెంబర్ 16న ప్రారంభిస్తారు. ఇది దేశంలో సంస్థకు 24వ హాస్పిటల్. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రూ.150 కోట్లతో 500 బెడ్ల సామర్థ్యం గల మరో హాస్పిటల్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 

ఇందులో పూర్తిస్థాయి క్యాన్సర్ కేర్ యూనిట్ కూడా ఉంటుంది. మెడికవర్‌‌ చైర్మన్  అనిల్ కృష్ణ మాట్లాడుతూ,  ‘‘ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది ఐపీఓకి వెళతాం. సేకరించిన ఫండ్స్‌తో హాస్పిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు,  అప్పు తగ్గించుకుంటాం. 

హైదరాబాద్‌లోని చందనగర్ హాస్పిటల్‌లో 150 బెడ్లు పెంచి, దేశవ్యాప్తంగా మెడికవర్‌‌ సామర్థ్యాన్ని 6,400 బెడ్లకు తీసుకెళ్లాలని చూస్తున్నాం”అని అన్నారు. బెంగళూరు, పుణే వంటి నగరాల్లో కూడా విస్తరణను పరిశీలిస్తున్నామని తెలిపారు. చిన్న హాస్పిటల్స్ కొనుగోలు ప్రణాళికలు ఇప్పటికిప్పుడు లేనప్పటికీ,  సమయం వస్తే ఈ స్ట్రాటజీని పరిశీలిస్తామని తెలిపారు. 

ఏఐ టెక్నాలజీతో  వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని, మెరుగైన చికిత్సలు అందించడంలో ఇది కీలకంగా మారుతుందని  కృష్ణ అభిప్రాయపడ్డారు. క్లినికల్ నిర్ణయాలు పూర్తిగా వైద్యులదే, మేనేజ్‌మెంట్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.