
అబుదాబి: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. గ్రూప్–బిలో భాగంగా మంగళవారం జరిగే తమ చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తేనే బంగ్లా సూపర్–4 రేసులో నిలుస్తుంది. తొలి పోరులో హాంకాంగ్‌పై నెగ్గి.. గత పోరులో శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లా టైగర్స్‌కు అఫ్గాన్ బౌలింగ్ విభాగం ముఖ్యంగా స్పిన్నర్ల నుంచి ముప్పు ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, మరో ఓటమితో రెండు పాయింట్లతో బంగ్లా గ్రూప్–--బిలో మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సూపర్–4లో స్థానం దక్కించుకోవాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
అయితే, లంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ టీమ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాపార్డర్ విఫలమవగా.. జాకర్ అలీ, షమీమ్ హుస్సేన్ జట్టు పరువు నిలిపారు. ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ లిటన్ దాస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. హాంకాంగ్‌పై హాఫ్ సెంచరీతో రాణించిన దాస్ ఇప్పుడు అఫ్గానిస్తాన్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై గ్రాండ్ విక్టరీ సాధించిన అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్ బౌలింగే. కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ, యువ సంచలనం నూర్ అహ్మద్‌తో పాటు ఘజన్‌ఫర్ వంటి స్పిన్నర్లు బంగ్లాదేశ్‌కు కొరకరాని కొయ్యగా మారనున్నారు. అబుదాబి పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో అఫ్గాన్ బౌలింగ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లోనూ రషీద్ సేన పటిష్టంగా ఉంది. బంగ్లాను ఓడిస్తే అఫ్గాన్ సూపర్–4 బెర్తును సొంతం
చేసుకోనుంది.