
- మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు.. 3.04 లక్షల టన్నులు
- విలువ రూ. 690 కోట్లు
- మూడు సీజన్ల వడ్లు రెండు నెలల్లో మరో సీజన్ వడ్లు
యాదాద్రి, వెలుగు: గడువు మీద గడువు పెంచుతున్నా.. సీఎంఆర్ అప్పగించడంలో కొందరు మిల్లర్లు ఆలస్యం చేస్తున్నారు. మూడు సీజన్లు ముగిసి.. నాలుగో సీజన్ సమీపిస్తున్నా ఒక్క సీజన్ సీఎంఆర్ కూడా పూర్తిగా అందించడం లేదు. ఈ నెల 12తో వానాకాలం 2024–-25 గడువు ముగిసినా సీఎంఆర్ ఇంకా పూర్తిగా అప్పగించలేదు. దీంతో ఈసారి రెండు నెలల గడువు పెంచారు.
ప్రతి ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ప్రభుత్వం రూ. వందల కోట్లు వెచ్చించి వడ్లు కొనుగోలు చేస్తోంది.
ఈ వడ్లను సీఎంఆర్ కోసం మిల్లర్లకు ప్రభుత్వం అప్పగించి వారి నుంచి బియ్యం తీసుకుంటోంది. బియ్యం అప్పగించడంలో మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వడ్లను కొందరు మిల్లర్లు సీఎంఆర్ రూపంలో సకాలంలోనే అందిస్తున్నారు. మరి కొందరు మిల్లర్లు మాత్రం ఈ వడ్లతోనే బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక సీజన్ వడ్లను మరో సీజన్‌కు చూపిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విధంగా యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు పేరుకొని పోయాయి.
2022–-23 యాసంగి వడ్లు 32 వేల టన్నులు
2022-–23 యాసంగి సీజన్‌కు చెందిన 4 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసిన సివిల్‌సప్లయ్ డిపార్ట్మెంట్40 మిల్లులకు అప్పగించింది. సీఎంఆర్ అప్పగించకపోవడంతో 1.86 లక్షల టన్నుల వడ్లకు ఈ టెండర్ వేసి కేంద్రీయ బండార్ సంస్థకు అప్పగించింది. ఏడాది దాటినా ఇప్పటి వరకూ పూర్తిగా క్లియర్ చేయలేదు. ఒక మిల్లర్ రూ. 10 కోట్ల విలువైన వడ్లను అమ్ముకొని ఏకంగా జెండా ఎత్తేశాడు. ఈ సీజన్‌కు సంబంధించి మొత్తంగా రూ. 64 కోట్ల విలువైన 32 వేల టన్నులకు పైగా వడ్లు అప్పగించాల్సి ఉంది.
వానాకాలం సీఎంఆర్ పెండింగ్
2024-–25 వానాకాలం సీజన్లో 2.22 లక్షల టన్నుల వడ్లను సీఎంఆర్ కోసం సివిల్ సప్లయ్డిపార్ట్మెంట్48 మిల్లులకు అప్పగించింది. ఈ వడ్లను మరాడించి బియ్యం అప్పగించాల్సిన మిల్లర్లలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల12తో మూడోసారి సీఎంఆర్ గడువు ముగిసినా.. పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఈ సీజన్‌కు సంబంధించి రూ. 74.23 కోట్ల విలువైన 32,275 టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. ఇందులో 23 మంది మిల్లర్లు 90 నుంచి 100 శాతం సీఎంఆర్ అందించారు. కొందరు మిల్లర్లు అయితే 30 నుంచి 40 శాతం సీఎంఆర్ మాత్రమే అప్పగించారు.
యాసంగి -2025 సీజన్లో 2.40 లక్షల టన్నుల పెండింగ్
ఇటీవలే ముగిసిన యాసంగి సీజన్‌కు సంబంధించిన 3.77 లక్షల టన్నుల వడ్లను సేకరించిన సివిల్ సప్లయ్.. సీఎంఆర్ కోసం 42 మిల్లులకు అప్పగించింది. ఇందులో ఇప్పటివరకూ 35 శాతం మాత్రమే అప్పగించారు. ఇంకా రూ. 550 కోట్ల విలువైన 2.40 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి.
మిల్లుల్లో రూ. 690 కోట్ల విలువైన వడ్లు
యాదాద్రి జిల్లాలోని మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు పేరుకొని పోయాయి. ఈ మూడు సీజన్లకు సంబంధించి రూ. 690 కోట్ల విలువైన 3.04 లక్షల టన్నుల వడ్లు మిల్లర్ల వద్దే ఉన్నాయి. నవంబర్ నుంచి వానాకాలం 2025-26 సీజన్‌కు సంబంధించిన వడ్ల కొనుగోలు ప్రారంభం కానుంది. అప్పటివరకూ ఒక్క సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ కంప్లీట్ చేస్తరా.? లేదా..? అన్నది చూడాల్సిందే. కాగా జిల్లాలోని మిల్లర్లలో ఇప్పటికే ఇద్దరు మిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి రూ. 15.25 కోట్ల విలువైన వడ్లను అమ్మేసుకున్నారు. ఈ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో డిఫాల్టర్‌గా నిలిచిన మిల్లు ఆస్తులను వేలం వేసిన సంగతి తెలిసిందే.
నవంబర్ 12 వరకూ సీఎంఆర్ గడువు
సీఎంఆర్ గడువు ముగియడంతో రైస్ మిల్లులను ఎఫ్‌సీఐతో పాటు సివిల్ సప్లయ్ ఆఫీసర్లు తనిఖీ చేశారు. మిల్లుల్లో స్టాక్ ఉందా.? లేదా..? అన్న కోణంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వడ్ల బస్తాలను లెక్కించారు. స్టాక్ లెక్కలకు సంబంధించిన వివరాల రిపోర్ట్‌ను సమర్పించారు. రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం 12 నవంబర్ 2025 వరకూ గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటిలోగా పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ అప్పగించాల్సి ఉంటుంది.