ఇయ్యాల్టి (ఆగస్టు 3) నుంచి.. రుణమాఫీ షురూ

ఇయ్యాల్టి (ఆగస్టు 3) నుంచి.. రుణమాఫీ షురూ
  • ఇయ్యాల్టి నుంచి.. రుణమాఫీ షురూ
  • రూ.19 వేల కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉందన్న సీఎం కేసీఆర్​
  • విడతల వారీగా సెప్టెంబర్​ రెండో వారం వరకు పూర్తి చేయాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే చేసిన రుణమాఫీ పోను మరో రూ.19 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని  తెలిపారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ  సెప్టెంబర్ రెండో వారం వరకు పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ రుణమాఫీపై ఉన్నతస్థాయి సమీక్ష  నిర్వహించారు. 

ఈ  సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు, కరోనా, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకపోవడం వంటి కారణాలతో  రుణమాఫీ ఆలస్యం అయిందని వివరించారు. ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నదని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. 

ఈ సమీక్షలో  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్​ సీఎస్ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.