
- రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం రూ.1,200 కోట్లకుపైనే
- ప్రాథమిక లెక్కలు వస్తున్నా వెల్లడించని వ్యవసాయ శాఖ
- కాళేశ్వరం పంపుల మునకతో రూ.780 కోట్లు లాస్!
- రోడ్ల రిపేర్లకు రూ.571 కోట్లు అవసరమని అంచనా
- ఇండ్లు కూలి, గ్రామాల్లోకి నీళ్లు చేరి రూ.470 కోట్లు నష్టం
- నష్టంపై కేంద్రానికి లెటర్ రాయని రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వారం పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వానాకాలం పంటల కోసం దుక్కులు దున్ని వేసుకున్న విత్తులు, మొలక దశలోని పంటలు నీట మునిగి మురిగిపోగా, మరికొన్నిచోట్ల వరదల్లో కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు తెగిపోయి.. కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, ఇండ్లు నీటమునిగాయి. ఇలా దాదాపు రూ.3 వేల కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. వర్షాలు, వరదల నష్టంపై ప్రాథమిక అంచనాలతో రాష్ట్ర సర్కార్ రిపోర్ట్ తయారు చేసింది. కొన్నిచోట్ల ఇంకా వరద తగ్గకపోవడంతో పూర్తిస్థాయిలో అంచనా వేయలేదని ఆఫీసర్లు చెప్తున్నారు. సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పడు నష్టానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ కేంద్రానికి రాష్ట్రం నుంచి లెటర్ రాస్తారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి లెటర్ రాయలేదని ఆఫీసర్లు స్పష్టం చేశారు. సీఎం నిర్ణయం ఆధారంగా కేంద్రానికి వివరాలు పంపుతామని చెప్తున్నారు.
కాళేశ్వరం పంపులు రూ.780 కోట్లు ‘ముంచినయ్’
కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్హౌసుల్లోకి వరద చేరి మోటార్లు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని ప్రభుత్వానికి ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు. కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌసుల్లో కంట్రోల్ ప్యానల్స్, ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ ఏసీ సిస్టం, స్కాడా సిస్టం ఇతర ఎలక్ట్రిక్ బోర్డులు, విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. మొత్తంగా నష్టం ప్రాథమికంగా రూ.780 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. డీ వాటరింగ్ చేశాక ఏ మేరకు పంపుహౌస్‌లు దెబ్బతిన్నాయనే దానిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పుడే నష్టం ఎంతనేది చెప్పగలమని రిపోర్ట్‌లో వెల్లడించారు.
రోడ్ల నష్టం భారీగానే..
ఎడతెరిపి లేని వర్షాలతో ప్రధాన రహదారులతోపాటు గ్రామాలు, మండల రూట్లకు సంబంధించిన రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు 87 చోట్ల కొట్టుకుపోయాయి. 300 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వీటి రిపేర్లకు రూ.178 కోట్లు అవసరం పడుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి 114 ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 324 ప్రాంతాల్లో 617 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క పంచాయతీరాజ్‌కు సంబంధించే రిపేర్లకు రూ.343 కోట్లు అవసరమని అంచనా. హైవే రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రిపేర్లకు మరో రూ.50 కోట్లు అవుతాయని రిపోర్ట్‌లో ఆఫీసర్లు పేర్కొన్నారు. రోడ్ల రిపేర్లకు మొత్తంగా రూ.571 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.
గూడు చెదిరి.. మిగిలిన నష్టం రూ.470 కోట్లు
వర్షాలు, వరదలతో 900 గ్రామాలపై ప్రభావం పడినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్లు తెలిపారు. చాలా గ్రామాల్లో వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోయినట్లు నివేదించారు. ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయి.. ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. గొర్లు, బర్లు మత్యువాత పడ్డాయి. వీటితో పాటు ఇతర నష్టాలను కలిపితే రూ.470 కోట్ల మేర ఉంటుందని తెలిపారు.