పంటల మార్పిడి ఈజీ కాదు

పంటల మార్పిడి ఈజీ కాదు
  • 90 శాతానికిపైగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలే
  • నిర్మల్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కొంత క్రాప్ డైవర్సిఫికేషన్
  • మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పిస్తేనే రైతుల్లో మార్పు
  • కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలే అత్యధికంగా సాగవుతున్నయి. కొన్నేండ్లుగా జిల్లాల వారీగా పంటల మార్పిడిపై అధ్యయనం చేసిన ఆఫీసర్లు.. రాష్ట్రంలో రైతులు అంత ఈజీగా పంటలు మార్చే అవకాశం లేదని తేల్చారు. ఒకేసారి కాకుండా రైతులను దశలవారీగా క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు మళ్లించాలని సూచించారు. ఏ జిల్లా తీసుకున్నా.. ఈ మూడు పంటల సాగు విస్తీర్ణమే ఎక్కువగా ఉంటోందని ఈ మేరకు రాష్ట్రంలో వ్యవసాయం, పంటల సాగు, మార్కెటింగ్ వంటి వాటిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు రిపోర్ట్​ అందించారు. నిర్మల్, మహబూబ్​నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే నాలుగైదు రకాల పంటలు సాగు చేస్తున్నారని రిపోర్ట్​లో తెలిపారు. ఆ తర్వాత గద్వాల, వరంగల్ రూరల్, నాగర్​ కర్నూల్,  సంగారెడ్డి, నారాయణపేట, మహబూబాద్ జిల్లాల్లో కొంత వరకు పంటల మార్పిడి ఉన్నట్లు పేర్కొన్నారు.  పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 95 శాతం సాగు విస్తీర్ణంలో రెండు పంటలే వేస్తున్నారని, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, వనపర్తి, మంచిర్యాల, యదాద్రి భువనగిరి, నల్గొండ, మెదక్​, జనగామ, జయశంకర్, భదాద్రి, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, ఖమ్మం, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా వరి, పత్తి, కంది లేదంటే మొక్కజొన్న  వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​లో సీజన్ల వారీగా వేరుశనగ, శనగ సాగవుతున్నయి. గత రెండేళ్లలో ఖరీఫ్​లో కోటి15 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో కోటి ఎకరాల పైన పత్తి, వరి పంటలే ఉంటున్నయి. ఇక రబీలో వరి 75 శాతం వరకు సాగైంది. 

కారణాలు ఇవే.. 
వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే రైతులు సులువైన పంటలుగా భావిస్తున్నరని ఆఫీసర్లు రిపోర్ట్​లో పేర్కొన్నారు. వరికి సరిపడా నీళ్లు ఉండటం, తక్కువ పని, సంప్రదాయంగా వేస్తున్న పంట, ఎంఎస్పీ వస్తుండటంతో ఎక్కువగా ఆ పంట వైపే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. ఖరీప్ లో 50 శాతం సాగు విస్తీర్ణం పత్తి పంటదే ఉంటుందని తెలిపారు. పత్తి మంచి గిట్టుబాటు అవుతోందన్నారు. మంచి దిగుబడినిచ్చే ఇతర పంటల హైబ్రీడ్​ విత్తనాలు అందుబాటులో లేకపోవడం కూడా  పంటల మార్పిడి చేయకపోవడానికి కారణంగా పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సరైన క్రాప్​ ప్లానింగ్ చేయకపోవడం, ఉద్యాన పంటలకు లేబర్​ పని ఎక్కువగా ఉండటం, దిగుబడి, తగిన ధరలు లేకపోవడంతో సాగు తగ్గుతోందని వివరించారు. యువత వ్యవసాయం వైపు రాకపోవడంతో ఉన్న రైతులు పాత పద్ధతుల ప్రకారమే పంటలు వేసుకుంటూ వస్తుండటం కూడా ఒక కారణమని, ఈ ట్రెండ్ మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే చిన్న కమతాలు ఎక్కువగా ఉండటంతో ఉన్నదాంట్లో ఒకే రకం పంటను వేసుకుంటున్నట్లు చెప్తున్నారు. 

మెషీన్లు, గిట్టుబాటు ధర కల్పిస్తే.. 
రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలంటే మార్కెటింగ్ మెరుగుపర్చాలని కేబినెట్ సబ్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్​లో ఆఫీసర్లు వివరించారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు విత్తనాలు, మెషీన్లను అందించడం ద్వారా పంటల మార్పిడి చేయొచ్చని సూచించారు. గ్రామాలు, మండలాల వారీగా ఎక్కడ, ఏ పంటలు లోటులో ఉన్నాయో వాటిని సాగు చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సోయాబీన్, పప్పు ధాన్యాలు, పల్లి, ఆలుగడ్డ, ఉల్లి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్​పెరిగేలా చూడాలన్నారు. టెక్నాలజీలో భాగంగా డ్రోన్​ల వాడకం వంటివీ రైతులకు అందుబాటులోకి తెస్తే క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగే చాన్స్ ఉందన్నారు.  

టార్గెట్ 45 లక్షల ఎకరాలు
ఈ యాసంగిలో ప్రభుత్వం వరి వద్దని చెప్పినందున.. వరి మినహా ఇతర పంటలు 45 లక్షల ఎకరాల్లో వేసేలా టార్గెట్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇందులో మొక్కజొన్న 12 లక్షల ఎకరాలు, వేరుశనగ, శనగ 10 లక్షల ఎకరాల చొప్పున  రైతులు వేసేలా చూడాలని పేర్కొన్నారు. మినుములు, పెసలు, నువ్వులు, జొన్నలు 1.50 లక్షల ఎకరాల చొప్పున 6 లక్షల ఎకరాలు, కొత్తిమీర లక్ష ఎకరాల్లో, ఆముదం 2 లక్షల ఎకరాలు, సన్ ఫ్లవర్ 3 లక్షల ఎకరాల్లో వేసేలా పంటలను సజెస్ట్ చేశారు.