రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వాన

రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వాన

వడగండ్ల వాన ఆగమాగం జేసింది. సోమవారం రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాల్లో రాళ్ల వాన కురవగా, మంగళవారం ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్​, ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాల్లోఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లాలో ఒకరి ప్రాణం పోగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. చెట్లు కూలిపోయాయి. పోల్స్​ పడిపోయి కరెంట్​సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అనుకోని వానలు ఒకరి ప్రాణాలు తీశాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్​పెల్లి పంచాయతీలో గొండుగూడ గ్రామానికి చెందిన పెంద్రం రాజుపటేల్ (60) సోమవారం సాయంత్రం పంట చేనుకు కాపలాగా వెళ్లాడు. సడన్​గా వడగండ్ల వాన స్టార్టయి తలపై పడడంతో గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. ఇంటికి తీసుకువచ్చే లోపే చనిపోయాడు. 

అంతటా పంట నష్టం 

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్​ టౌన్​తో పాటు  జైనథ్, బేల, తలమడుగు, నార్నూర్, బోథ్, ఇచ్చోడ, బజార్ హత్నూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆదిలాబాద్​లో రోడ్లు మునిగిపోయాయి. జిల్లాలో మొక్కజొన్న పంట నాశనమైంది. వేరుశనగ పంట పూత దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  కాగజ్ నగర్ డివిజన్ లో సోమవారం నుంచి మంగళవారం వరకు ఈదురు గాలులతో వడగండ్ల వాన కురిసింది పెంచికల్ పేట్ మండలంలో శనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ ​జిల్లా దస్తురాబాద్ మండలంలోని  రేవోజీపేట్ లో ఇద్దరి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలుచోట్ల ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు విరిగిపోయాయి.  నర్సాపూర్, కుంటాల, దిలావర్ పూర్, సారంగాపూర్ మండలాల్లో  మొక్కజొన్న, కంది, పత్తి, జొన్న, మిరప, ఇతర పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. కొమ్రం భీమ్​జిల్లా దహెగాంలో చెట్ల కొమ్మలు విద్యుత్ పోల్స్​పై పడడంతో కరెంటు స్థంభాలు విరిగి సరఫరా ఆగిపోయింది.  ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసి ముద్దయింది. జొన్న, కంది పంటలు కూడా నేలకొరిగాయి.  

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో...

కరీంనగర్‌‌ సిటీలో భారీ వర్షంతో రోడ్లపై  భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో కరెంట్​సరఫరా ఆపేసిన ఆఫీసర్లు పొద్దుపోయే వరకు కూడా ఇవ్వలేదు.  వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీరామ పట్టాభిషేకం హోర్డింగ్‌ కూలింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రామడుగు, హుజూరాబాద్‌, జమ్మికుంట మండలాల్లో వడగండ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినిపల్లి, వేములవాడ, వీర్నపల్లి మండలాల్లో భారీ వర్షం ముంచింది. మరిమడ్లలో వడగండ్ల వాన పడగా, జగిత్యాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా  కాల్వ శ్రీరాంపూర్‌‌, సుల్తానాబాద్‌లోనూ  భారీ వర్షం పరేషాన్​ చేసింది.