ఎములాడకు పోటెత్తిన భక్తులు

ఎములాడకు పోటెత్తిన భక్తులు
  • మేడారం సమీపిస్తుండడంతో భారీగా రాక       
  • - రాజన్న దర్శనానికి 6 గంటలు సమయం

​వేములవాడ, వెలుగు :  దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో కొన్ని రోజులుగా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో ఆలయంతో పాటు పరిసరాలు భక్తులతో నిండిపోతున్నాయి. తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాలు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే ఆలయ అర్చకులు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం నిర్వహించారు.

భక్తులు తెల్లవారుజామునే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం  ధర్మగుండంలో పవిత్ర స్నానం అచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా లోపలికి వెళ్లి భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని, శ్రీ రాజరాజేశ్వర స్వామిని, శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కోడె మొక్కులు చెల్లించారు. ఆలయ గుడి చెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది. మరోవైపు ప్రసాదం కౌంటర్​, కోడెల టికెట్​ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.