కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి
  •     మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు
  •     పదో ఆదివారానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. 

కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలు  కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్ట పై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఆలయ ఏఈవోలు శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, ఆలయ అర్చకుడు మల్లికార్జున్, ఒగ్గు పూజారులు భక్తులకు కావల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు బందోబస్తు నిర్వహించారు.
 

అన్నదానానికి రూ.50, 116 విరాళం
 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన ఈనుకొండ మల్లారెడ్డి -రాధ దంపతులు మల్లన్న స్వామి క్షేత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.50,116  విరాళం ఇచ్చారు. దాతలను ఆలయ అధికారులు, ధర్మకర్తలు శాలువా కప్పి ఘనంగా  సన్మానించారు.