కొమురవెల్లిలో భక్తుల సందడి

కొమురవెల్లిలో భక్తుల సందడి
  •     వేసవి సెలవులు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు
  •     మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు
  •     పలు చోట్ల ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందిపడిన భక్తులు 

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానాలు చేసి మల్లికార్జున స్వామికి నైవేద్యం వండి బోనం ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

మరి కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు చేసి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. కాగా ఆలయ సమీపంలోని మల్లన్న చెరువు నుంచి వీవీఐపీ పార్కింగ్ మీదుగా సినిమా టాకీస్​ వరకు, బస్టాండ్ నుంచి పోలీసు బొమ్మ మీదుగా సబ్ స్టేషన్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.