న్యూఇయర్ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలన్ని భక్తులతో సందడిగా మారాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో దర్శనానికి క్యూ కట్టారు. దాదాపు లక్ష మంది వరకు టెంపుల్ కు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు . భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ప్రదక్షిణలపై ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ తో పాటు ఆదివారం కూడా కావడంతో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. ఉచిత దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండుగంటల సమయం పడుతోంది. ప్రసాదాల క్యూ కాంప్లెక్సుల దగ్గర కూడా భక్తులు బారులు తీరారు.
వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వరంగల్ నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసి పోయాయి. కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయాలకు వెళ్తున్నారు. ఇష్టదైవాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ, కొండగట్టుతో పాటు స్థానిక ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. కొత్త ఏడాదిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గడపాలని ప్రార్ధిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పెంచిన నిత్యపూజ టికెట్ల ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. అమ్మవారి రుద్రాభిషేకం 200 నుంచి 500 లకు, అక్షరాభ్యాసానికి 100 నుంచి 150కి, నిత్య చండి హోమం 1116 నుంచి నుంచి 1500 వందలకు పెంచారు. సత్యనారాయణ స్వామి పూజకు 100 నుంచి 400 కు పెంచారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో న్యూఇయర్ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. ఇయర్ ఎండింగ్ రోజున ఎంజాయ్ చేసిన జనం టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రేపు ముక్కోటి ఏకాదశి కూడా కావడంతో ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాల్లో దర్శనాలు చేసుకోవడానికి భక్తులు బారులు తీరారు.